విదేశాలకు ఆంధ్ర అరటి
కడప,
మన ప్రాంత అరటి అంతర్జాతీయ మార్కెట్‌లోనూ సత్తా చాటుతోంది. ఎగుమతులను పెంచుకుంటూ రైతులకు భరోసా కల్పిస్తోంది. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ కొనుగోలుదారులు, అమ్మకందారులతో ఇప్పటికే ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35 వేల టన్నుల అరటి పండ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో అరటి సాగుదారులకు మరింత ప్రయోజనం కలగనుంది.రాష్ట్రంలో 63.84 లక్షల టన్నుల అరటి పండ్లు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో ఒక్క వైఎస్సార్ కడప జిల్లా నుంచే 23,15,300 టన్నుల దిగుబడి వస్తోంది. ఒక్క పులివెందులలోనే 1,100 హెక్టార్లలో అరటి సాగవుతుండగా.. ఇక్కడి పంటకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. సాధారణంగా అరటి పండ్లు 6, 7 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇక్కడి పండ్లు 14 రోజుల వరకు నిల్వ ఉంటాయి. టిష్యూకల్చర్ వచ్చాక పండ్లలో నాణ్యత పెరిగింది. కడప జిల్లాలో పండే అరటిలో 80 శాతం చెన్నై, బెంగళూరు నగరాలకు ఎగుమతి అవుతున్నాయి.రాష్ట్రంలో 1,12,995 హెక్టార్లలో అరటి సాగవుతోంది. ఏటా 63,84,730 టన్నుల అరటి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అరటి సాగవుతుండగా.. విస్తీర్ణం, ఉత్పత్తిలో కడప ప్రథమ స్థానంలో ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి.మధ్య ప్రాచ్య దేశాలైన యూఏఈ, బెహ్రయిన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్ దేశాల్లో మన అరటికి మంచి డిమాండ్ ఉంది.గ్రీన్ కావెండిష్ ప్రీమియమ్ రకాలు ఆ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2016–17లో 246 టన్నుల అరటి పండ్లు ఎగుమతి కాగా.. 2017–18లో 4,300 టన్నులు, 2018–19లో 18,500 మెట్రిక్ టన్నులకు ఎగుమతులు పెరిగాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35 వేల మెట్రిక్ టన్నుల అరటి పండ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కొవ్వూరులో మాత్రమే అరటి పరిశోధనా స్థానం ఉంది. సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు మార్కెట్‌ను విస్తరించేందుకు వీలుగా డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ఏడాది కడప జిల్లా పులివెందులలో అరటి పరిశోధనా కేందం ఏర్పాటుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేశారు. దీని కోసం ప్రభుత్వం 70 ఎకరాల భూమిని, పరిశోధనల కోసం 628 ఎకరాల భూమిని కేటాయించింది.