పండుగలతో బెల్లం వ్యాపారుల జోష్
విశాఖపట్టణం,
అనకాపల్లి బెల్లం మార్కెట్ పండుగ జోష్‌తో కళకళలాడింది. ప్రతి ఏటా ప్రధానమైన పండగలకు బెల్లంతో తయారు చేసే పిండి వంటలను దేశంలోని పలు ప్రాంతాల వారు వండుతారు. ఈ క్రమంలోనే బెల్లానికి గిరాకీ పెరుగుతోంది. సహజంగా క్వింటాలుకు రూ.3500 పలికే అనకాపల్లి బెల్లం మార్కెట్లో క్వింటాలు బెల్లం ధర అనూహ్యంగా పుంజుకుంది. మొదటి రకం బెల్లం గరిష్టంగా రూ.4,720 పలకడంతో మార్కెట్‌వర్గాల్లో జోష్ కనిపించింది. మే నెలాఖరు నాటికి దాదాపు బెల్లం తయారీ పూర్తవుతుంది.ఆ తర్వాత రైతులు తయారు చేసిన బెల్లాన్ని వర్తకులు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుతారు. ఈ బెల్లం అంతా రోజు వారీ కార్యకలాపాలతో పాటు ఉత్సవాలకు అవసరమైనప్పుడు దశలవారీగా కోల్డ్ స్టోరేజీ నుంచి బెల్లాన్ని తీసుకొచ్చి మార్కెట్లో విక్రయిస్తుంటారు. దసరా వచ్చిన వెంటనే బెల్లం తయారీకి రైతులు పూనుకున్నప్పటికీ మొదట్లో తయారు చేసిన బెల్లాన్ని దేవునికి సమర్పిస్తారు.ఈ కారణంగా కొత్త బెల్లం అధికంగా దసరా, దీపావళి నుంచి మార్కెట్‌కు వస్తుంది. హోల్‌సేల్‌తో పాటు రిటైల్ మార్కెట్లోనూ బెల్లానికి ఒక్కసారిగా డిమాండ్ పెరగడం ధర అనూహ్యంగా పుంజుకుంది. అనకాపల్లి మార్కెట్ నుంచి బీహార్, ఒడిశా, బెంగాల్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తారు. అక్కడి వర్తకులు ఈ బెల్లాన్ని కొనుగోలు చేసుకుని పండగ సమయంలో విక్రయిస్తారు. గత ప్రభుత్వ హయాంలో అనకాపల్లి బెల్లానికి జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్నప్పటికీ చంద్రన్న కానుక కోసం అవసరమైన బెల్లాన్ని సరఫరా చేసే టెండర్‌ను గుజరాత్ వర్తకులకు అప్పగించారు.అప్పుడు కనీస టర్నోవర్ నిబంధనను తెరపైకి తెచ్చి రాష్ట్రంలో పేరొందిన అనకాపల్లి బెల్లానికి డిమాండ్ లేకుండా చేశారు. ఈ ఏడాది దసరా ముందురోజైన సోమవారం అనకాపల్లి మార్కెట్‌కు 1504 దిమ్మలు రాగా మొదటి రకం క్వింటాలుకు గరిష్టంగా రూ.4720, మూడో రకం కనిష్టంగా రూ.2850 పలికింది. బెల్లం ధర అధికంగా పలకడంతో చెరకు రైతులు దసరా తర్వాత నుంచి బెల్లం తయారీపై మరింత మక్కువ చూపే అవకాశముంది