YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హూజూర్ కోసం ఐక్యతా రాగాలు

హూజూర్ కోసం ఐక్యతా రాగాలు

హూజూర్ కోసం ఐక్యతా రాగాలు
నల్గొండ, 
కాంగ్రెస్ పార్టీలో కనిపించినంత ప్రజాస్వామ్యం ఏ పార్టీలోనూ కనిపించదు. కనీసం వినిపించదు. ఒకరిపై మరొకర తిట్టుకుంటారు. కొట్టుకుంటారు. మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, పార్టీ సీనియర్లయినా, ఇలా ఎవరిమీదైనా, ఏ స్థాయి నాయకుడైనా విమర్శలు కురిపిస్తాడు. వర్గపోరు, ముఠాపోరుతో కప్పల తక్కెడలా కనిపించే ఆ పార్టీ ఆఫీసు, నిత్యం రణక్షేత్రమే. కానీ ఆ విభేదాలు, స్పర్థలన్నీ తొలగిపోయాయా అన్నట్టుగా, ఆ నేతలందరూ ఏకమయ్యారు ఒక లక్ష్యం కోసం, చేతులు కలిపారు మొన్నటి వరకూ కొట్టుకున్న నేతలు ఐక్యతారాగం వినిపిస్తుండటంతో, పార్టీ కార్యకర్తలే షాకవుతున్నారట.  ఉత్తమ్‌ కమార్‌ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జానారెడ్డి. భట్టి విక్రమార్క. వి. హనుమంత రావు. రేవంత్‌ రెడ్డి. ఒకరిపై మరొకరు నిత్యం కత్తులు నూరే ఈ నాయకులంతా, ఇప్పుడు హుజూర్‌ నగర్‌ వేదికగా ఏకమయ్యారు. ఈ దృశ్యాలు కాంగ్రెస్‌ కార్యకర్తలకు నయనానందకరంగా వుంటే, నేతలకు మాత్రం స్టన్నవుతున్నారట. వీళ్లేంటి, ఒకే లక్ష్యం కోసం, పోరాడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారట. తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లందర్నీ ఏకం చేసింది హుజూర్ నగర్ ఉపఎన్నిక. అన్ని విషయాల్లో వివాదాలకు ప్రాధాన్యతనిచ్చే నేతలు సైతం, బైపోల్స్‌లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే ఎలా ఉంటుందో హుజూర్ నగర్ ఉప ఎన్నికల క్యాంపెయిన్‌ చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడూ పీసీసీపై విరుచుకుపడే కోమటి రెడ్డి, హుజూర్ నగర్ ఎన్నికలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కోమటి రెడ్డి ఒక అడుగు ముందుకు వేయడంతో మిగతా నేతలంతా హుజూర్ నగర్ బాట పట్టారు. ఉప ఎన్నిక సందర్భంగా, అభ్యర్థిని పీసీసీ చీఫ్‌ ఏకపక్షంగా నిర్ణయించడాన్ని విభేదించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం ప్రచారానికి సిద్దమవుతున్నారు. పార్టీ సీనియర్ నేత విహెచ్ సైతం తన వంతుగా ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడూ పార్టీలో ఏ చిన్నతప్పు అనిపించినా నిర్మోహమాటంగా విమర్శలు చేసే విహెచ్, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సొంతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే వీళ్లంతా ఏకం కావడానికి అభ్యర్ది పద్మావతి రెడ్డి చొరవే కారణమన్న చర్చ పార్టీలో జోరుగా వినిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి స్వయంగా ఎవరితోనూ మాట్లాడ్డానికి నిరాకరించడంతో, పద్మావతి రెడ్డి నేరుగా ఉత్తంతో పొసగని నేతలను ప్రచారానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆమె తీసుకున్న చొరవతోనే పార్టీ సీనియర్లంతా హుజూర్ నగర్ బాటపట్టారని, నేతలు మాట్లాడుకుంటున్నారు. దీనికి తోడు ఉప ఎన్నికను చావోరేవోగా కాంగ్రెస్ భావిస్తుండటంతో, గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది ఖద్దరు పార్టీ. హుజూర్ నగర్‌లో గెలుస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉందని ప్రచారం చేసుకోవచ్చని భావిస్తున్న నేతలు, అందులో తమకూ క్రెడిట్‌ వుండేలా క్యాంపెయిన్‌ ప్లాన్ చేస్తున్నారు. హుజూర్‌ ఫలితంతో, వచ్చే మున్నిపల్ ఎన్నికల్లోనూ పార్టీకి మాంచి ఊపు వస్తుందని అనుకుంటోంది. అందుకే అందరూ ఒక్కటయ్యామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు నేతలు. మొత్తానికి అధిష్టానానికి ఐక్యతా రాగం వినిపించడానికో, తమ మధ్య విభేదాలున్నా, లేకపోయినా పార్టీ కోసం సమైక్యంగా ముందుకు వస్తామన్న సంకేతం ఇవ్వడానికో, గాంధీభవన్‌ నాయకులు ఉవ్విళ్లూరుతూ హుజూర్‌ నగర్‌ కదనరంగంలో దూకుతున్నారు. మరి వీరి ఐక్యతారాగం ఏ మేరకు ఫలిస్తోందో చూడాలి.

Related Posts