ముఖ్యమంత్రి దృష్తికి చింతలపూడి ఎత్తిపోతల పధకం
ఏలూరు,
చింతలపూడి ఎత్తిపోతలపధకం పనులు యుద్దప్రాతిపధికపై జరిగేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్ది దృష్టికి తసుకువెళతానిని ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. స్థానిక మంత్రీ కేంపు కార్యాలయంలో శుక్రవారం ఉపముఖ్యమంత్రి ని కలిసి చింతలపూడి అసెంబ్లీనియోజకవర్గ పరిధిలో పలు సమస్యలను చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా, నాని దృష్టికి తీసుకువచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డా .వైఎస్ రాజశేఖర్ రెడ్ది చింతలపూడి ఎత్తిపోతల పధకానికి శ్రీకారం చుట్టారని, గత తెలుగుదేశం పాలనలో ఈ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందాన మారిందని మెట్ట ప్రాంతం సస్యశ్యామలం కావడానికి ఈ ఎత్తిపోతల పధకం ఎంతో దోహదపడుతుందని ఎలీజా చెప్పారు. భూసేకరణ విషయంలో సరైన రేటు రాకపోవడంతో 18 కేసులు కోర్టులో రైతులు దాఖలు చేశారని రైతులతో మాట్లాడి భూసేకరణ పరిహారం పెంచాలని ఎలీజా కోరారు. చింతలపూడిలో వందపడకల ఆసుపత్రి అభివృద్ది చేయడానికి తగుసహ కారం అందించాలని, జంగారెడ్ది గూడెంలో వున్న ప్రభుత్వ ఆసుపత్రీలో ఆధునికవైద్య సదుపాయాలు కల్పించాలని, ముఖ్యంగా ఐసియు వార్దుతోపాటు, ఎంఆర్ఐ,సిటీ స్కానింగ్ వంటి ఆధునిక వైద్యపరికరాలు అందుబాటులోకి తసుకురావాలని మైసన్నగూడెం గ్రామంలో ప్రత్యేక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని కోరారు. దీనిపై నాని మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, చింతలపూడి ఎత్తిపోతల పధకం విషయంపై ప్రాజెక్టు పరిధిలోని శాసనసభ్యులతో రైతులతో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసి అందరి అభిప్రాయాల మేరకు ఒక నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించి మెట్టప్రాంత అభివృద్దికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈవిషయంలో ముఖ్యమంత్రి పూర్తి సహకారం ఉంటుందని ఆళ్ల నాని చెప్పారు. చింతలపూడి ప్రాంతంలో గత ప్రభుత్వపాలనలో భూగర్భజలాలు బాగా అడుగంటాయని వర్షాభావ పరిస్థితులవల్ల వేసిన పంట కూడా ఎండిపోతున్నా, గత పాలకులు పట్టించుకోలేదని, నాని చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని వైఎస్ రాజశేఖర్ రెడ్ది ప్రారంభించిన చింతలపూడి ఎత్తిపోతులపధకం పూర్తిచేసి రైతులమన్ననలు పొందుతామని చెప్పారు. భూసేకరణవల్ల భూములకు ఇచ్చే పరిహారం విషయంలో రైతుల్లో వున్న ఆందోళనలను తొలగించి ఇచ్చే పరిహారం పెంచే అంశంకూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.