సమర్థవంతంగా పనిచేస్తోన్నచంద్రయాన్-2 ఆర్బిటార్
తాజాగా చంద్రుడి ఉపరితలం ఫోటోలు పంపిన ఆర్బిటార్
న్యూఢిల్లీ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ విఫలమైనప్పటికీ.. ఆర్బిటార్ మాత్రం సమర్థవంతంగా పనిచేస్తోంది. తాజాగా చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన ప్రకాశవంతమైన ఫొటోలను ఆర్బిటార్ తీసింది. స్పెక్ట్రోమీటర్‌ను ఉపయోగించి చంద్రుడి ఉపరితలం మీద పడుతున్న సూర్యకాంతిలోని తారతమ్యాలను విశ్లేషించింది. తద్వారా చంద్రుడి ఉపరితలంపై నిక్షిప్తమైన మూలకాల స్థాయిని.. అదే విధంగా చంద్రుడి మూల స్థానం, పరిభ్రమానికి సంబంధించిన విషయాలను తెలుసుకునే వీలు కల్పించింది. ఈ క్రమంలో ఆర్బిటార్ తీసిన ఫొటోలను ఇస్రో తన ట్విటర్‌లో అకౌంట్‌లో షేర్ చేసింది. కాగా చంద్రుడు స్వయం ప్రకాశితుడు కాదన్న సంగతి తెలిసిందే. సూర్యకాంతి అద్దం మీద పడి ప్రతిబింబించినట్లుగా.. చంద్రుడి ఉపరితలంపై కాంతి పడి పరావర్తనం చెందడం ద్వారా చంద్రుడు మెరుస్తున్నట్లుగా కనిపిస్తాడు. అయితే చంద్రుడి ఉపరితలం అంతటా ఈ కాంతి ఒకేవిధంగా పరావర్తనం చెందదు. చంద్రుడికి సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలను కనుగొనేందుకు ఇస్రో పంపిన ఆర్బిటర్ ఉపయోగపడనుంది. ఇక చంద్రయాన్-2 ఆర్బిటర్ తాజాగా విడుదల చేసిన ఫొటోల ఆధారంగా చంద్రుడి ఉపరితలంపై ఉన్న ఖనిజాల మిశ్రమంలో ఉన్న తేడాల వల్ల చంద్రుడు కొన్నిచోట్ల అత్యంత ప్రకాశవంతంగా.. మరికొన్ని చోట్ల మామూలుగా ప్రకాశిస్తున్నాడని ఇస్రో వివరించింది. తద్వారా చంద్రుడి ఉపరితలం వేటితో నిర్మితమైంది, అక్కడ మూలకాలు, ఖనిజాల స్థాయి ఎంత తదితర రహస్యాలను తెలుసుకనే వీలు కలుగుతుందని పేర్కొంది. ఉత్తరార్థగోళం నుంచి చంద్రుడిపై గుంతల వంటి భాగాలు(సోమర్‌ఫీల్‌్డ, స్టెబిన్స్, కిర్క్‌వుడ్) ఆర్బిటార్ తీసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపింది. ఆర్బిటార్‌లోని ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ ద్వారా 800 నానోమీటర్ల నుంచి 5000 వేల నానోమీటర్ల పరిధిలో వివిధ ఫొటోలను తీసినట్లు వెల్లడించింది. కాగా చంద్రయాన్-2 ఆర్బిటార్‌లో ఉన్న ఎనిమిది పరికరాలు అద్భుతంగా పనిచేస్తున్న విషయం విదితమే. నిజానికి ఆర్బిటార్ జీవితకాలం ఏడాది మాత్రమే అయినా.. దాని జీవితకాలాన్ని పొడగించే అవకాశాలు ఉన్నాయని ఇస్రో పేర్కొంది. ఆర్బిటార్ ద్వారా.. చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన పలు వివరాలు.. ఇందుకు సంబంధించిన త్రీడీ మ్యాపుల రూపకల్పన చేస్తున్నారు. అదే విధంగా చంద్రుడి ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, కాల్షియం, టైటానియం, ఐరన్, సోడియం వంటి మూలకాల ఉనికిని గుర్తించేందుకు తోడ్పడడం వంటి మరెన్నో ప్రయోజనాలను ఆర్బిటార్ కలిగి ఉంది. కాగా చంద్రయాన్-2లోని ఎల్ఐ4 కెమెరా నీలి రంగులో మెరిసిపోతున్న భూగ్రహం ఫొటోలను కూడా ఇస్రో విడుదల చేసిన సంగతి తెలిసిందే.