జగన్ కంటే రాజశేఖర్ రెడ్డి బెటర్
గుంటూరు,
జగన్ సర్కారు మీడియాపై ఆంక్షలు విధించడం దారుణమని ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలిపారు. గుంటూరులో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయ.. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. తమ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశారన్న బాబు.. ఇప్పుడు మీడియాపై కూడా దాడులు జరుగుతున్నాయన్నారు. జర్నలిస్టు సత్యనారాయణ చనిపోవడం దారుణమన్నారు. దీనికి మూలాలు వైఎస్ హయాంలోనే ఉన్నాయన్నారు.2007లో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జీవో తీసుకొచ్చారన్న బాబు.. విలేకరులు, ఎడిటర్లంతా ఈ జీవోకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారన్నారు. ఈ జీవోకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మీడియ ప్రముఖులు గళం విప్పారన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ జీవోకు వ్యతిరేకంగా ఏకమయ్యారని.. ప్రతిపక్షాలు ఏకమయ్యాయని తెలిపారు. వైఎస్ మాట్లాడిన వీడియో క్లిప్పింగులను బాబు ప్లే చేయించారు.‘‘దీంతో రాజశేఖరరెడ్డి భయపడిపోయి.. గత నాలుగు ఐదు నెలలుగా మీడియా వాచ్ పెట్టలేదని చెప్పారు. వెంటనే ఈ జీవోను రద్దు చేస్తున్నానని ప్రకటించారు. కానీ మీ ప్రమేయం లేకుండా ఈ జీవో ఎలా వచ్చిందో చెప్పాలనీ మేం డిమాండ్ చేశాం. దీంతో ఈ విషయంలో విచారణ జరిపేందుకు వైఎస్ అంగీకరించారు. రాజశేఖర రెడ్డి విజ్ఞతను అభినందించాలి.. ప్రజలు, మీడియా ఆందోళనలు చేయడంతో ఆయన దాన్ని వెనక్కి తీసుకున్నారు.ఇప్పుడు జగన్ ఇలాంటి జీవోకే పదును పెట్టారు. వైఎస్ నాడు జీవోను వెనక్కి తీసుకున్న విషయాన్ని జగన్ పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి విజ్ఞతతో చేసిన తప్పిదాన్ని సరి చేసుకున్నారు. కానీ జగన్ అహంభావంతో, గర్వంతో ఈ జీవోను తీసుకొచ్చారు. చివరకు సోషల్ మీడియాను కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చారు.వివేకానంద రెడ్డి హత్య కేసు మీద ఎవరూ మాట్లాడొద్దని డీజీపీ చెబుతున్నారు. ఆయన ఇటీవలే డీజీపీ అయ్యారు... కానీ నేను 14 ఏళ్లు సీఎంగా పని చేశాను. వర్ల రామయ్య మాట్లాడితే ఆయనకు నోటీసులు పంపారు. పోలీసులు ఆయన్ను హెచ్చరించారు. కడప ఎస్పీలను ఎందుకు మార్చారు? ఆయన మాట్లాడితే తప్పేంటి..? మీసాలు తిప్పడం ఏంటి..? తొడగొట్టి ఛాలెంజ్ చేయండి ఏంటి?’’ అని బాబు ప్రశ్నించారు.