బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలి: ఆళ్ల
అమరావతి
రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం ఇచ్చిన బలవంతపు భూసేకరణ చట్టాన్ని రద్దు చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. అమరావతి ప్రాంతంలో రాజధాని సరైన నిర్ణయం కాదని శివరామకృష్ణ కమిషన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన భూసేకరణ చట్టం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భూములను అమ్ముకోలేక, వారసత్వం ఇచ్చుకోలేక నష్టపోతున్నారని చెప్పారు. రైతులకు ఇష్టం లేకపోయినా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆనాడు టీడీపీ ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేసిందని లేఖలో పేర్కొన్నారు. భూసేకరణకు ఒప్పుకోని రైతులపై కేసులు పెట్టడమే కాకుండా.. వారి పంటలను తగుటబెట్టించారని ఆర్కే ఆరోపించారు. ఏడాదికి మూడు నుంచి ఐదు పంటలు పండే భూములను అన్యాయంగా తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌ను ఈ చట్టాన్ని రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరినట్టు వెల్లడించారు.