ఫ్యాన్ కేడర్ లో నైరాశ్యం
విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలను చేపట్టిన తొలినాళ్లలో క్యాడర్ ఫుల్ జోష్ లో ఉంది. దాదాపు తొమ్మిదేళ్లు అధికారంలోకి దూరంగా ఉండటం, నవ్యాంధ్రప్రదేశ్ లో తొలిసారి పవర్ లోకి రావడంతో ఇక తమకు అంతా మంచిరోజులేనని వైసీపీ నేతలు, కార్యకర్తలు భావించారు. జగన్ ను నమ్ముకుని ఉంటే తమ భవిష్యత్తుకు ఢోకా ఉండదని భావించారు. తెలుగు తమ్ముళ్ల మాదిరిగా తాము కూడా కొత్త కార్లు కొనేసుకుని తిరిగేయవచ్చని సంబరపడ్డారు. అయితే జగన్ ఐదు నెలల పాలనలో తమకు ఒరిగిందేమీ లేదని ఫ్యాన్ పార్టీలో క్యాడర్ పెదవి విరుస్తోంది.జగనన్నను ఎలాగైనా అధికారంలోకి తేవాలని కసితో పనిచేశారు ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ క్యాడర్. జగన్ అధికారంలోకి వస్తే చాలు అని భావించారు చాలా మంది. వారు శ్రమించడంతోనే వైఎస్ జగన్ కు ఏపీలో 151 సీట్లు దక్కాయి. ఎన్నడూ లేనిది టీడీపీ 23 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదంతా వైసీపీ క్యాడర్ కష్టం ఫలితేమనన్నది కాదనలేని వాస్తవం. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ లో నైరాశ్యం అలుముకుంది. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతలు ఈ ఎన్నికల్లో తమ సొంత డబ్బులు ఖర్చుచేసి మరీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశారు.కానీ జగన్ అధికారంలోకి రాగానే తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా వైసీపీ సెకండ్ లెవెల్ క్యాడర్ లో అసంతృప్తి బయలుదేరింది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు పనులు రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్తవి భవిష్యత్తులో పిలిచే అవకాశమున్నప్పటికీ కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లను అమలు చేశారు. అలాగే ఇక మద్యం షాపులను మూసివేయించారు. ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మద్యం షాపులపై ద్వితీయ శ్రేణినేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుండటంతో ఇక వీరికి ఆ ఆదాయమార్గం కూడా మూసుకుపోయింది.ఇసుక విషయంలోనూ జగన్ పాలసీ మార్చేశారు. పారదర్శకంగా,జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఇసుక సరఫరా చేస్తుండటంతో తెలుగుతమ్ముళ్ల మాదిరి ఊహించుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు లబోదిబో మంటున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నేతలు స్థానిక ఎమ్మెల్యేలపై వత్తిడి తెచ్చే పనిలో ఉన్నారు. తాము పార్టీ కోసం ఖర్చు చేసిన సొమ్ము ఎవరిస్తారని నేరుగా ఎమ్మెల్యేలనే ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ఇదే రకమైన అనుభవం ఎదురయింది. అయితే ఆయన వారిని సర్ది చెప్పి పంపాల్సి వచ్చింది. ఇలా వైసీపీలోని సెకండ్ లెవెల్ క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయాలకు భగ్గుమంటోంది. వారికి లోకల్ గా నామినేటెడ్ పదవులు ఇచ్చి సంతృప్తి పర్చేందుకు కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు.