పశ్చిమగోదావరి జిల్లాల్లో టీడీపీకి గడ్డు కాలమే...
ఏలూరు,
ఆ జిల్లాలో టీడీపీకి ఒకప్పుడు ఎదురే లేదు. పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా సదరు జిల్లాలో సైకిల్ జోరు సాగుతూనే ఉంది. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబుకు ఎంతో ఇష్టమైన జిల్లా కూడా. అదే పశ్చిమ గోదావరి జిల్లా. ఈ జిల్లాలో టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో టీడీపీ ఇక్కడ అప్రతిహత విజయాలను నమోదు చేసింది. 2014లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఎంపీ సీట్లు కూడా బీజేపీతో కలిపి టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. మొత్తం 46 జెడ్పీటీసీల్లో 43 టీడీపీ కైవసం చేసుకుంది.అయితే, ఇప్పుడు పార్టీ తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒంటరి పోరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వంపై వ్యతిరేకత కావొచ్చు, స్థానిక ఎమ్మెల్యేల పనితీరులో లోపాలు కావొచ్చు.. ఇక్కడ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. నిజానికి చంద్రబాబు 2014లో సీఎం అయ్యేందుకు ఈ జిల్లా ఎంతగానో ఉపయోగ పడింది. అదే సమయంలో బాబు ప్రతిష్టాత్మకంగా భావించిన పోలవరం ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే ఉండడం గమనార్హం. ప్రతి సోమవారం చంద్రబాబు పోలవరంపై సమీక్ష చేయడంతోపాటు.. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా హైలెట్ అయిన పట్టిసీమ ప్రాజెక్టు కూడా ఈ జిల్లాలోనే ఉంది. ఇక చింతలపూడి ఎత్తిపోతల పథకం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కూడా బాబు ఇక్కడ ప్రారంభించారు. అయినప్పటికీ.. ఇటీవల ఎన్నికల్లో టీడీపీకి తీవ్రవ్యతిరేక పవనాలు ఎదురయ్యాయి. ఉండి, పాలకొల్లులో మాత్రమే గెలుపు గుర్రం ఎక్కగలిగింది. దీంతో పార్టీలో పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. పార్టీలో కీలకంగా ఉంటారని భావించిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జైల్లో ఉండడం, చింతలపూడి నుంచి పోటీ చేసి ఓడిన కర్రారాజారావు, తాడేపల్లిగూడెంలో ఓడిన ఈలి నాని యాక్టివ్‌గా లేరు.ఇక మాజీ మంత్రి పితాని సత్యనారాయణలు పెద్దగా యాక్టివ్‌గా లేకపోవడంతో పాటు పక్క చూపులు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మాజీ మంత్రి పీతల సుజాత వంటి వారు యాక్టివ్‌గా ఉన్న వారికి ఎలాంటి పదవులూ లేక పోవడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇక కొవ్వూరులో ఓడిన వంగలపూడి అనిత అసలు ఆ నియోజకవర్గం వైపే చూడడం లేదు. దీంతో అక్కడ టీడీపీ చుక్కా లేని నావ మాదిరిగా మారింది. మెట్టలో ఉన్న నాలుగు రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది.మెట్టలో ఉన్న నాలుగు రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో గ్రూపుల గోల ఎక్కువైంది. అసలు వీళ్లు అధికార పక్షంతో పోరాడడం కంటే తమలో తామే పోరాడుకుంటున్నారు. ఇక మాగంటి బాబు లాంటి సీనియర్ దాదాపు అస్త్ర సన్యాసం చేసినట్టే. ఇక టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి స్పీడ్‌గా మూవ్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో ఒకప్పుడు ఇంకా చెప్పాలంటే దశాబ్దాల పాటు ఇక్కడ వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.