YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అడ్డూ, అదుపు లేకుండా వెదురు అక్రమాలు

అడ్డూ, అదుపు లేకుండా వెదురు అక్రమాలు

అడ్డూ, అదుపు లేకుండా వెదురు అక్రమాలు
కర్నూలు, 
నల్లమల అటవీ ప్రాంతంలో వెదురు సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. లాగింగ్‌  సిబ్బంది రుద్రవరం, చెలిమ అటవీ రేంజ్‌ పరిధిలోని ఎనిమిది కూపుల్లో శ్యాంపిల్‌ ప్లాట్లు వేయించారు. ఆ నివేదికల ఆధారంగా నంద్యాలలో డీఎఫ్‌ఓ శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించారు. ఒక్కో కూపు నుంచి వెదురు సేకరణ, ట్రాన్స్‌పోర్టు  గ్రేడింగ్‌ అనే మూడు అంశాలకు సంబంధించి మొత్తం ఎనిమిది కూపులకు గాను 24 టెండర్లు చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి టెండర్లను ఏకపక్షంగా దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువగా టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. గత ఐదేళ్లూ వెదురు సేకరణలో అక్రమాలకు పాల్పడిన వీరు..ఈసారి కూడా రంగంలోకి దిగడం గమనార్హం. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కూలీలతో వెదురు సేకరించి డిపోలకు తరలించాలి. ఉదాహరణకు రుద్రవరం అటవీ రేంజ్‌ పరిధిలోని అహోబిలం కూపులో వెదురు సేకరణ టెండరును శంకర్‌ అనే కాంట్రాక్టర్‌ దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఆ కాంట్రాక్టరే సదరు కూపులో వెదురు సేకరించాలి. అక్కడ సేకరించిన వెదుర్లను చెన్నయ్య అనే రవాణా కాంట్రాక్టర్‌ తన వాహనంలో రుద్రవరం కలప డిపోకు తరలించాలి. ఈ రెండు పనులకు సంబంధించి ఒక్కో వెదురుపై ప్రభుత్వం రూ.5 చొప్పున చెల్లిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. నేరుగా వ్యాపారులు ఎవరికి వారుగా కూలీలతో వెదుర్లను సేకరించుకుంటున్నారు. వెదురు గ్రేడింగ్‌ను బట్టి ఒక్కో దానిపై రూ.4.50 నుంచి రూ.11.50 వరకు కూలి చెల్లిస్తున్నారు.అనంతరం ఒక్కో వెదురుకు రూ.2 చొప్పున బాడుగ ఇచ్చి డిపోకు తరలిస్తున్నారు. అక్కడా కొంత సొమ్ము చెల్లించి గ్రేడింగ్‌ చేయించి లాట్లుగా పేర్చి వేలానికి సిద్ధం చేసుకుంటున్నారు. డివిజన్‌ పరిధిలోని అన్ని కూపుల్లోనూ ఇదేవిధంగా జరుగుతోంది. వాస్తవానికి ఇందులో ఓ మతలబు ఉంది. వెదురు సేకరణ, ట్రాన్స్‌పోర్టు, గ్రేడింగ్‌ కాంట్రాక్టర్లు...వెదుర్లను వేలం పాడే వ్యాపారులు అందరూ ఒక్కరే. రుద్రవరం కలప డిపో పరిధిలో పది మంది, గాజులపల్లి (చెలిమ అటవీ రేంజ్‌) డిపో పరిధిలో మరో పది మంది దాకా వ్యాపారులు సిండికేట్‌ అయ్యి గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. వెదురు సేకరణ, వేలం పాటల్లో అంతా తామై వ్యవహరిస్తూ భారీఎత్తున అక్రమాలకు ఒడిగడుతున్నారు. వీరికి అధికారుల సహకారం కూడా ఉంటోంది. కొత్త వారిని దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధర కంటే అధికంగా కూలీలకు ఇస్తూ సొంతంగా వెదుర్లను సేకరించుకుంటున్నారంటేనే అక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.వేలానికి ముందు అటవీ అధికారులు అడవిలోకి వెళ్లే కూలీలకు వెదురు నరకడంపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిదేమీ ఇవ్వకపోవడంతో కూలీలు వెదుర్లను అడ్డదిడ్డంగా నరికి వేస్తున్నారు. ఒక పొద నుంచి వెదురు సేకరించాలంటే  భూమికి అడుగు ఎత్తు ఉంచి నరకాలి. అలాగే ఆ పొదలో ముదురు వెదుర్లు కనీసం ఐదు మిగిల్చాలి. అలా ఉంచక పోవడంతో ఆ వెదురు పొద పట్టు కోల్పోయి కూలిపోతోంది. ఇలా అడవిలో ఎక్కడ చూసినా కూలిన వెదురుపొదలే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా దినదినానికి వెదురు ఉత్పత్తి తరిగి పోతోంది. వెదురు వేలం మొదలుపెట్టే ముందు కలప డిపో అధికారులు శ్యాంపిల్‌ ప్లాట్లు మేస్త్రీలతో వేయించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. టెండర్లు పూర్తయ్యి వెదురు సేకరణ ప్రారంభం కాగానే.. కూలీల వెంట ఉండి నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా వారిదే. కూపుల్లో వెదుర్లను సేకరించిన తర్వాత వాటిని వాహనంలోకి చేర్చే సమయంలో సదరు ఫారెస్టర్‌ వెదుర్ల సంఖ్యను లెక్కించి వాటికి అనుమతి పత్రం అక్కడే ఇవ్వాలి. అయితే వారు ఇళ్ల వద్ద ఉంటూ మేస్త్రీలను అడవికి పంపిస్తున్నారు. మేస్త్రీలు అడవి లోపలి నుంచి వాహనాలు బయటకు వచ్చే సమయానికి రోడ్లపైకి చేరుకుని.. కూలీలు చెప్పినన్ని వెదుర్లకు అనుమతి పత్రాలు ఇస్తున్నారు.   

Related Posts