ఫిబ్రవరి మొదటివారంలో 2.5 లక్షల ఇళ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సంక్రాంతి సమయంలో ముహూర్తం సరిగా లేనందున... ఫిబ్రవరి మొదటి వారంలో సామూహిక గృహ ప్రవేశాలు చేద్దామని వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో మరో విడత గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేసారు. 18 లక్షల ఇళ్ళను 2019 జనవరికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖను ఆదేశించారు. కేంద్రం నుంచి మరిన్ని ఇళ్లను సాధించాల్సి ఉందన్నారు. రాజకీయంగాను పార్లమెంటులో ప్రస్తావించి సాధించుకోవాలన్నారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహనిర్మాణం కింద 2017-18లో మంజూరు చేసిన ఇళ్ల సంఖ్య రెండు లక్షలు కాగా.. ఇప్పటివరకు 1,88,559 (94%) ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు.
అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండోరోజు గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా.. మస్తర్లు నిర్వహించడంలో హోసింగ్ శాఖ దారుణంగా విఫలం అయ్యిందని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు ఆరోపించారు. దీనిపై స్పందించిన హౌసింగ్ శాఖ కార్యదర్శి కాంతి లాల్ దండే నిధులకు సంబంధించిన వివరాలను అందించటంలో పంచాయతీ రాజ్ శాఖ విఫలమైందని పరస్పర ఆరోపణలు చేశారు. రెండు ప్రభుత్వ శాఖలు ఆరోపణలు చేసుకోవడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు సర్దిచెప్పారు. 2019 జనవరి కల్లా ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద 5 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. 2019 జనవరి కల్లా 18 లక్షల ఇళ్లు ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనని, దీనికోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఎమ్మార్వో, ఆర్డీవోలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి అర్హులైనవారికి వారసత్వ హక్కులు కల్పించాలని ఆదేశించారు.