YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఈ సారైనా స్టాలిన్ కు కలిసొస్తుందా

ఈ సారైనా స్టాలిన్ కు కలిసొస్తుందా

ఈ సారైనా స్టాలిన్ కు కలిసొస్తుందా
చెన్నై, 
డీఎంకే అధినేత స్టాలిన్ కల నెరవేరుతుందా? అన్నీ అనుకూలంగా ఉన్నా ఏదో ఒక అవాంతరం వచ్చిపడే అవకాశముంది. ఆరు పదులు దాటిన స్టాలిన్ ఇంత వరకూ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ దక్కలేదు. నిన్న మొన్నటి వరకూ తండ్రి కరుణానిధి ఉండటం ఆయన చాటున నేతగా ఎదిగారు స్టాలిన్. స్టాలిన్ చెన్నై నగర మేయర్ గా, మంత్రిగా పనిచేశారు తప్ప ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. అయితే జయలలిత మరణం తర్వాత స్టాలిన్ లో ఆశలు చిగురించాయి. అన్నాడీఎంకే తమకు ఏమాత్రం పోటీ కాదని స్టాలిన్ భావించడమే ఇందుకు కారణం.నిజానికి దశాబ్దాల కాలం నుంచి అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యే పోరు ఉంటుంది. తమిళనాడు ప్రజలు ఒకసారి అన్నాడీఎంకేకు, మరొకసారి డీఎంకేకు పట్టం కడుతూ వచ్చారు. మొన్న మాత్రం రెండు దఫాలు జయలలితకు జై కొట్టారు. అన్నాడీఎంకే ఓటు బ్యాంకుతో పోల్చుకుంటే డీఎంకేకు కొంత తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా యువత, మహిళలు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతూ వచ్చారు. అది నిన్నటి మాట. జయలలిత మరణంతో డీఎంకే కు ఊపు పెరిగింది. జయలలిత, కరుణానిధి మరణంతో తమిళనాడులో ఇమేజ్ ఉన్న నేతగా ఒక్క స్టాలిన్ మాత్రమే ఉన్నారు.ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు, శాసనసభ ఉప ఎన్నికల్లోనూ స్టాలిన్ సత్తాచూపించారు. లోక్ సభ ఎన్నికల విజయాలు చూసి ఇప్పటికిప్పుడు శాసనసభ ఎన్నికలు వస్తే బాగుండని డీఎంకే అభిమానులు సయితం సంబర పడ్డారు. 2021లో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. స్టాలిన్ ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగి కుమారుడు ఉదయనిధిని నియమించారు. మహిళా విభాగాన్ని కూడా బలోపేతం చేసి పటిష్టమైన ఓటు బ్యాంకును రూపొందించుకోవాలన్న కసితో ఉన్నారు స్టాలిన్.ఇదే పరిస్థితులు మరో రెండేళ్లు కంటిన్యూ అవుతాయని గ్యారంటీ లేదు. రజనీకాంత్ కొత్త పార్టీ తమిళనాడులో రానుంది. రజనీకి తమిళనాడు నిండా అభిమానులే. ఆయన ఇప్పటికే సభ్యత్వ నమోదును ప్రారంభించారు. దాదాపు కోటి దాటిందని అంచనా. రజనీకాంత్ పార్టీని ప్రకటించి శాసనసభ ఎన్నికల గోదాలోకి దిగితే స్టాలిన్ కొంత ఇబ్బంది పడక తప్పదు. ప్రజలు మార్పు కోసం చూస్తే రజనీ వెంట నిలుస్తారు. అయితే కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చి ఫెయిల్ అవ్వడం స్టాలిన్ కొంత ఊరట. ఈసారైనా స్టాలిన్ కు ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే ఇక ఆయన కల నెరవేరదన్నది డీఎంకే వర్గాల మాట. ఎందుకంటే ఇప్పటికే పదేళ్లు ప్రతిపక్షంలో డీఎంకే ఉంది. మరో ఐదేళ్ల పాటు పార్టీని నడపటం, నాయకత్వాన్ని నిలుపుకోవడం స్టాలిన్ కు సవాల్ గా మారనుంది.

Related Posts