హూజూర్ నగర్ ఎవరి సొంతం...
నల్గొండ,
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల యుద్ధంలో నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది రాష్ట్ర స్థాయిలో ఆసక్తికర చర్చసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ తామేంటో తేల్చుకునేందుకు ఈ ఎన్నికల్లో మోహరించాయి. పార్టీ అగ్రనేతలను బరిలోకి దింపి జోరుగా ప్రచారం చేయిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రచార పర్వంలో దూసుకెళ్లాయి. బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్లు తమ సత్తా చాటుతామని ఉప బరిలో నిలబడ్డాయి. ఎవరికివారు ప్రచారంలో హామీలు, విమర్శలు గుప్పిస్తుండడంతో ఈ ఎన్నికల్లో విజేత.. పరాజితులు ఎవరోనని ఉమ్మడి నల్ల గొండ జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.ఉప ఎన్నికలతో కాంగ్రెస్‌లో ముఖ్య నేతలు ఐక్యతారాగం అందుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి, పార్టీ అభ్యర్థి పద్మావతిలు ఇద్దరు నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికతో ఆపార్టీ నేతలంతా ఒక్కటయ్యారు. ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థి విజయం కోసం సర్వ శక్తులొడ్డుతున్నారు. ఉమ్మడి జిల్లా నేతలతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ముఖ్య నేతలంతా ప్రచారంలో ఉన్నారు. వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రచార జోరు పెంచింది. అయితే రాష్ట్ర స్థాయి నేతలంతా ప్రచారంలో ఉండడంతో ఇక విజయం తమదేనని ఆపార్టీ ధీమాగా ఉంది ఎన్నికల్లో విజయం సాధిస్తే ఇది వచ్చే మున్సిపల్ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందన్న ఆలోచనలో ఆపార్టీ నేతలున్నారు. టీఆర్‌ఎస్‌కు దీటుగా నేతలంతా ఐక్యంగా ప్రచారం చేస్తుండడంతో కేడర్‌లో కూడా నూతనోత్తేజం వచ్చిందని ఆపార్టీ భావిస్తోంది. గతంలో ఉత్తమ్ స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాకు పాల్పడుతుందని, నియోజకవర్గం అ«భివద్ధి కాకపోవడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని ఆపార్టీ నేతలు అంతటా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ఆర్టీసీ సమ్మె, ప్రజల ఇబ్బందులు ఇవన్నీ తమకు కలిసి వచ్చి భారీ మెజార్టీ వస్తుందని ఆపార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. గులాబీ దండులా టీఆర్‌ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌లు, ఇతర ముఖ్య నేతలంతా నియోజకవర్గంలోనే ఉండి ముఖ్య నేతలకు ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో ఇతర జిల్లా ముఖ్య నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. గ్రామ, మండల నేతలతో ఈ నేతలు సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. గతంలో ట్రక్కు గుర్తుతో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యామని, ఈ సారి అభ్యర్థి పేరు, గుర్తులను.. డమ్మీ బ్యాలెట్‌తో ఓటర్లకు చూపిస్తున్నారు. కేటీఆర్ రోడ్ షో భారీగా సక్సెస్ అయిందని, సీఎం కేసీఆర్ సభ కూడా ఇంతకన్నా ఎక్కువగా విజయంవంతం అవుతుందని పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి భారీగా జన సమీకరణలో పార్టీ ముఖ్య నేతలు నిమగ్నమయ్యారు. మండలాల వారీగా ప్రచార బాధ్యతలు తీసుకున్న నేతలు కేసీఆర్ సభకు జనసమీకరణకు కసరత్తులో ఉన్నారు. కేసీఆర్ సభ ముగియడం, ఇతర జిల్లాల నేతలు మండలాల నుంచి వెళ్లిపోయిన తర్వాత గ్రామాలు, మండలాల్లోని ముఖ్యనేతలకు పోల్‌మేనేజ్‌మెంట్‌పై పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే హుజూర్‌నగర్ అభివద్ధి చెందుతుందని, ఉత్తమ్ ఇప్పటి వరకు నియోజకవర్గానికి ఏమీ చేయలేదని .. టీఆర్‌ఎస్ ప్రచారంలో విమర్శలు సంధిస్తోంది.టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, ఉత్తమ్‌తో అభివద్ధి జరగలేదని.. బీజేపీ, టీడీపీలు ప్రచార అస్త్రాలుగా చే సుకున్నాయి. పార్టీ అభ్యర్థి ప్రచారానికి బీజేపీ ఆపార్టీ ఎంపీలు, ముఖ్య నేతలను రంగంలోకి దింపింది. ఉమ్మడి జిల్లా నేతలతో సమన్వ యం చేసుకుంటూ పార్టీ రాష్ట్ర నేతలు కాం గ్రెస్, టీఆర్‌ఎస్‌కు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులతో నియోజకవర్గం అభివద్ధి చేస్తామని ఆపార్టీ నేతలు ప్రచారంలో హామీల వర్షం కురి పిస్తున్నారు.ఇక టీడీపీ కూడా తమకు కేడర్ బలంగానే ఉందని, ఏ ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకుతో సత్తా చాటుతామని ముఖ్య నేతలతో హోరాహోరీగా ప్రచారం చేయిస్తోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల పైన ఉన్న వ్యతిరేకతతోనే తమకు ఓట్లు రాలుతాయన్న ధీమాలో ఆపార్టీ ఉంది. ఇండిపెండెంట్లు కూడా ప్రచార జోరు తగ్గనివ్వడం లేదు