YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

పత్తి కొనుగోళ్లకు అంతా సిద్ధం

పత్తి కొనుగోళ్లకు అంతా సిద్ధం

పత్తి కొనుగోళ్లకు అంతా సిద్ధం
హైద్రాబాద్, 
ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో   ఒక్కో మార్కెట్‌ యార్డులో ఒక్కో రేటు కొనసాగుతోంది. పది ఎలక్ట్రానిక్‌ తూకం కాంటాలను ఏర్పాటు చేశారు. 40 మెట్రిక్‌ టన్నుల కాంటా ఒకటి, 20 మెట్రిక్‌ టన్నుల కాంటాలు మూడు, 5 మెట్రిక్‌ టన్నుల కాంటాలు మూడు, ఎడ్లబండ్లకు సంబంధించి మూడు కంటాలను ఏర్పాటు చేశారు.గతేడాది పత్తి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ.4,320 ఉండగా, ఈయేడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించిన విషయం విదితమే. గతేడాది కంటే ఈ యేడాది మద్దతు ధరను క్వింటాలుకు రూ.1130 పెంచింది. ఈ నిర్ణయంతో అన్నదాతల్లో సంతోషం ఉన్నా ప్రైవేట్‌ వ్యాపారులు, సీసీఐ అధికారులు మద్దతు ధర చెల్లిస్తారో లేదోనని రైతులు దిగాలు చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.5450 కనీస మద్దతు ధర నిర్ణయించింది. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతుండడంతో క్వింటాలుకు రూ.6వేలు చెల్లిస్తే గానీ గిట్టుబాటు కాదని పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతేడాది కంటే ఈ యేడాది మద్దతు ధర పెంచినప్పటికీ ఎరువులు, విత్తనాల ధరలు పెరగడంతో ఖర్చులు కూడా భారీగా పెరిగాయని చెబుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతు ప్రకటిస్తే బాగుంటుందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆదిలాబాద్‌ మార్కెట్‌ పరిధిలో 298 కాటన్‌ కమీషన్‌ ఏజెంట్లు ఉన్నారు. ప్రస్తుతం 225 మంది కొనుగోళ్లు చేయనున్నారు. 186 మంది ట్రేడర్స్, 27 జిన్నింగ్‌ మిల్లులు అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి షెడ్లు ఏర్పాటు చేశారు.వ్యాపారులు, సీసీఐ అధికారులు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. వ్యాపారులంతా సిండికేట్‌గా మారి రైతుకు గిట్టుబాటు ధర చెల్లించేందుకు వెనుకంజ వేస్తున్న విషయం తెలిసిందే. కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ఇప్పటికే పలుసార్లు వ్యాపారులు, సీసీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ఆదేశించారు. పత్తిని అన్‌లోడింగ్‌ చేసిన తర్వాతే తేమ శాతాన్ని పరీక్షించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం వరంగల్‌ మార్కెట్‌లో ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాలుకు రూ.5,800తో కొనుగోలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆదిలాబాద్‌ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.5,600 నుంచి రూ.5800 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు సిండికేట్‌ కావడంతో ధర పెంచుతారో లేదనేది అనుమానంగానే ఉంది. మద్దతు ధర కంటే తక్కువగా ఉంటేనే ప్రభుత్వరంగ సంస్థ అయిన సీసీఐ రంగంలోకి దిగుతుంది. గతేడాది జిల్లా వ్యాప్తంగా 34,629 క్వింటాళ్లు మాత్రమే సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేట్‌ వ్యాపారులు 23లక్షల 59వేల 627 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. గతేడాది మొత్తం జిల్లా వ్యాప్తంగా 23లక్షల 94వేల 226 క్వింటాళ్ల పత్తి రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. సీసీఐ 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని, ఆపై తేమ శాతం పెరిగే కొనుగోలు చేయబోమని స్పష్టం చేస్తున్నారు. 8 శాతం తేమ ఉంటే మద్దతు ధర రూ.5,450, అంతకంటే కంటే ఒక్క శాతం పెరిగితే అదనంగా రూ.54.50 చొప్పున కోత విధించనున్నారు. ఇదే నిర్ణయాన్ని ఈసారి ప్రైవేట్‌ వ్యాపారులు కూడా పాటించే విధంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభమైంది. దీంతో మంచు కురియనుండడంతో పత్తిలో తేమ ఎలాగైనా ఉంటుంది.ఇదే అదునుగా తీసుకుంటున్న వ్యాపారులు రైతులు పంటపై నీళ్లు చల్లి మార్కెట్‌కు తీసుకొస్తున్నారని కోతలు విధించడంతో అన్నదాతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. కలెక్టర్‌ తేమ శాతం పేరిట కోతలు ఎక్కువగా విధించవద్దని ప్రైవేట్‌ వ్యాపారులతో జరిగిన సమావేశంలో సూచించారు. 8 నుంచి 12 శాతం తేమ ఉంటే కొంత కోత విధించాలని, 12 నుంచి 16 శాతం తేమ ఉంటే మరో కొంత కోత విధించాలే తప్పా, ఇష్టారీతిన కోతలు విధిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. తేమ కొలిచే యంత్రాల్లో వ్యత్యాసం ఎలా వస్తుందని అధికారులను కలెక్టర్‌ ప్రశ్నించారు. తేమ యంత్రాన్ని సగం భాగంలో పెడితే తేమ ఒక విధంగా, పూర్తిగా ఉంచితే మరో విధంగా, సీసీఐ తేమ యంత్రంలో మరో విధంగా రావడంపై అసహనం వ్యక్తం చేశారు. రైతులకు నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులు ఆదేశించారు.

Related Posts