ప్రగతిభవన్, బీఆర్కేభవన్ వద్ద ఆంక్షలు
హైద్రాబాద్,
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో కూడా అదే తరహా నిర్బంధకాండ కొనసాగుతున్నది. కాకపోతే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులూ ఉండవు. ముందస్తు హెచ్చరికల ఊసే ఉండదు. కానీ ఎక్కడికక్కడ పోలీసులు తమ పని తాము కానిచ్చేస్తుంటారు. అనుక్షణం నిఘా నీడలో పౌరులు బతకాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గత పదమూడు రోజుల నుంచి ఇవే పరిణామాలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్‌ఎస్ సర్కారు తీవ్రమైన నిర్బంధాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్ వద్ద గత వారం రోజుల నుంచి పోలీసు పహారా కొనసాగుతున్నది. బారికేడ్లతో ఆ భవన్ ద్వారాలన్నింటినీ పోలీసులు మూసేశారు. ఆర్టీసీ జేఏసీలతోపాటు వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు సమ్మెకు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రదర్శనలన్నీ ఎక్కడ ప్రారంభమైనా.. ముగింపు మాత్రం బస్ భవన్ వద్దే. ఈ క్రమంలో రోజుకో యూనియన్, సంఘం అక్కడ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంగణం దద్దరిల్లుతున్నది. వీటన్నింటినీ కట్టడి చేయలేని ప్రభుత్వం.. బారికేడ్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. దీంతో బస్ భవన్ పరిసరాలన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు సమ్మెకు మద్దతుగా నిలుస్తున్న వివిధ సంఘాలు, యూనియన్లు తమ ర్యాలీలను బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ప్రారంభిస్తున్నాయి. దీంతో పోలీసులకు ఇక్కడ కూడా ఇబ్బందులొచ్చిపడ్డాయి. అందుకే ఆ పార్కు పరిసరాలను కూడా దిగ్బంధనం చేస్తున్నారు. సమ్మెకు సంఘీభావంగా ఇందిరాపార్కు వద్ద ప్రతిరోజూ దీక్షలు, వంటావార్పులు, నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బస్ భవన్ నుంచి ఇందిరాపార్కుకు వెళ్లే దారిలో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు ఇరువైపులా పోలీసులు.. నాలుగైదు వ్యాన్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఇటు బస్‌భవన్ వద్ద ఆందోళనలు నిర్వహించేవారినీ, అటు ఇందిరాపార్కు వద్దకు దీక్షలకు వెళ్లే వారినీ అరెస్టు చేయటానికి వీలుగా వారు ఈ వాహనాలను అందుబాటులో ఉంచుతుండటం గమనార్హం. ఇక ఇందిరాపార్కు వద్ద కూడా ప్రతిరోజూ వందలాది మంది పోలీసులను మొహరించటాన్నిబట్టి సమ్మెపట్ల ప్రభుత్వం ఎంత తీవ్రమైన నిర్బంధాన్ని విధిస్తున్నదో విదితమవుతున్నది.ఇదే రకమైన పరిస్థితి అటు ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతి భవన్ వద్దా, ఇటు తాత్కాలిక సచివాలయమైన బీఆర్‌కే భవన్ వద్దా కనిపిస్తున్నది. ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ను ఎత్తేస్తామంటూ గతంలో కేసీఆర్ సర్కారు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అప్పటి నుంచి ఇందిరాపార్కు వద్ద వివిధ సామాజిక, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలను మళ్లీ కొనసాగిస్తున్నాయి. అయితే అక్కడి కంటే ఎక్కువగా ఇప్పుడు ప్రగతి భవన్ వద్దే నిరసనలు హోరెత్తుతున్నాయి. తాజాగా టీఆర్టీ అభ్యర్థులు, గ్రూపు-2 అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. అయితే పోలీసులు ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారందర్నీ అరెస్టు చేశారు. మరోవైపు బీఆర్‌కే భవన్‌లోకి మీడియాను అనుమతించొద్దంటూ ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. విషయమై ఇటీవల పాత్రికేయుల బృందం సీఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. అయినా సర్కారు స్పందించలేదు. దీంతోపాటు సీఎం రాజకీయ కార్యదర్శి అదర్ సిన్హా సైతం బీఆర్‌కే భవన్‌లోకి మీడియాను రానీయొద్దంటూ భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయమై మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు జర్నలిస్టులు ప్రయత్నించగా.. ఆయన ఎలాంటి హామీ ఇవ్వకుండా అక్కడి నుంచి జారుకున్నారు. ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పరిష్కరించకపోవటంతో బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. బళ్లు, కాలేజీలూ బందయ్యాయి. ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు, ఆందోళనకు అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరిస్తున్నారు. ఇలాంటి అంశాలన్నింటిపై అధికారుల వివరణ తీసుకుని వార్తలు రాసేందుకు ప్రయత్నిద్దామంటే పాత్రికేయులకు బీఆర్‌కే భవన్‌లోకి అనుమతి లభించటం లేదు. అందుకే ఇప్పడు హైదరాబాద్ నగరం.. మరో కాశ్మీర్‌లాగా మారిందని రాజకీయ విశ్లేషకులు, మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, సాగర హారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె సందర్భంలోనూ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే కనిపించింది. అయితే రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ప్రజా ఉద్యమాలపై ఇంకా నిర్బంధకాండ కొనసాగుతుండటం గమనార్హం. తెలంగాణ వస్తే ధర్నాలూ, రాస్తారోకోలు ఉండబోవంటూ అప్పట్లో కేసీఆర్ చెప్పారు. అంటే ప్రజలకు ఎలాంటి సమస్యలూ లేకుండా చూస్తారేమోనని అందరూ భావించారు. అందుకు భిన్నంగా ఇలా నిర్బంధకాండ విధించి.. ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయటం దారుణమని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు