YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వేధిస్తున్న విత్తనాల కొరత

వేధిస్తున్న విత్తనాల కొరత

వేధిస్తున్న విత్తనాల కొరత
వరంగల్, 
రబీ సీజన్‌లో రైతులను వేరుశనగ విత్తనాల కొరత వెంటాడుతున్నది. రైతులు విత్తనాల కోసం ఆగచాట్లు పడుతున్నారు. విత్తనాల పంపిణీలో వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రబీ సీజన్‌కు వ్యవసాయ శాఖ పెట్టుకున్న వేరుశనగ విత్తనాల లక్ష్యాన్ని పూర్తి చేయడం లేదు. ఒకవైపు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు విత్తనాలు, ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పలుమార్లు హెచ్చరిస్తున్నా... రైతులకు మాత్రం విత్తనాలు అందడం లేదు. మరోవైపు విత్తుకునేందుకు ఆదును దాటిపోతున్నది. కొన్ని చోట్ల విత్తినా మొలకెత్తలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీ సీజన్‌ ప్రారంభం కంటే ముందు నుంచే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వేరుశనగ విత్తనాలు వేసుకుంటారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సబ్సిడీ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచుతారు. ఈ రబీలో మొత్తం 76,170 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ తన ప్రణాళికలో పొందుపరిచింది. ఇందులో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా 66,170 క్వింటాళ్లు, జాతీయ విత్తన కార్పొరేషన్‌  ద్వారా 10వేల క్వింటాళ్ల పంపిణీ లక్ష్యంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా వేరుశనగ విక్రయ ధరను రూ 9వేలుగా నిర్ణయించింది. ఇందులో ప్రభుత్వం రూ 4 వేలు సబ్సిడీ ఇస్తుండగా, రైతుల వాటా క్వింటాల్‌కు రూ 5వేలు చెల్లించాల్సి ఉంది. మొత్తం 76వేల క్వింటాళ్లలో ఇప్పటి వరకు కేవలం 29,296 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. ఇందులో 26,296 క్వింటాళ్లు విక్రయాలు జరిపినట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటివరకు సగం కూడా అమ్మకాలు జరగలేదు. సమయం దాటిపోతున్నదనీ, భూమిని సిద్ధం చేసుకున్నప్పటికీ విత్తనాలు అందుబాటులో లేవని అన్నదాతలు అంటున్నారు. విత్తుకుంటున్న మోసాలు వాస్తవానికి బహిరంగ మార్కెట్‌లో వేరుశనగ విత్తనాలకు కాస్త ధర తక్కువ ఉన్నప్పటికీ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాత్రం క్వింటాకు రూ 9వేల పైగా వెచ్చించి 75 వేల క్వింటాళ్లను టెండర్‌ ప్రక్రియ ద్వారా సేకరిస్తున్నది. అయితే ఇందులో అధికంగా రాయలసీమ జిల్లాల నుంచి అధికంగా రానుంది. ఇటీవల అక్కడ వర్షాలు కురవడం, వేరుశనగ విత్తనాలు పూర్తి తేమగా ఉండటంతో పచ్చిగా ఉన్నవాటికే టీఎస్‌ఎస్‌డీసీ లేబుల్స్‌ వేసి రైతులకు అంటగడుతున్నారు. ఆ విత్తులు మొలవకపోవడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఒక కంపెనీ నుంచి టీఎస్‌ఎస్‌డీసీ కొనుగోలు చేసిన వేరుశనగ విత్తనాల్లో జర్మినేషన్‌(మొలకెత్తే శాతం) 68 శాతం మాత్రమే ఉన్నట్లు ల్యాబ్‌ రిపోర్ట్‌లో తేలినట్టు సమాచారం.

Related Posts