బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహ
గుంటూరు
ప్రధాని నరేంద్ర మోదీతో తనకు వ్యక్తిగత విభేదాలు లేవంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు గతం మర్చిపోకూడదని బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మోదీని తిట్టడం కోసం ధర్మపోరాట దీక్షలు ఎవరు పెట్టించారని ప్రశ్నించారు. గల్లా జయదేవ్ లతో విమర్శలు చేయించింది ఎవరని నిలదీశారు. మోదీ మెడలు వంచుతామని అన్నది చంద్రబాబు కాదాని గుర్తు చేశారు. రాజధాని అమరావతి శంకుస్థాపన సమయంలో మోదీ పవిత్రజలాలు పంపితే అవమానించింది చంద్రబాబు కాదా అంటూ విమర్శల జడివాన కురిపించారు. ఓ వైపు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే మరోవైపు మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయించారని సోము వీర్రాజు ఆరోపించారు. గుంటూరు జిల్లా వేమూరులో జరిగిన గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారం కోల్పోయిన నేపథ్యంలో బీజేపీతో మళ్లీ పొత్తు కోసం చంద్రబాబు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలం పెరగడంతో చంద్రబాబులో అభద్రతా భావం ఎక్కువైందని, అందుకే ఇప్పుడు స్వరం మార్చారని వ్యాఖ్యానించారు.