విజయసాయికి శ్రీభరత్ కౌంటర్
విశాఖపట్టణం,
సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె, చిన్న అల్లుడు శ్రీ భరత్ మతుకుమిల్లి ఆస్తులను ఆంధ్రా బ్యాంక్ వేలం వేయనున్నట్లు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీ భరత్ కుటుంబం ఆంధ్రా బ్యాంక్‌కు రూ.13 కోట్లకుపైగా బకాయి పడిందని తెలుస్తోంది. దీంతో ఆస్తుల వేలానికి ఆంధ్రా బ్యాంకు ప్రకటన ఇచ్చింది. మెస్సర్ వి.బి.సి రెన్యువేబిల్ ఎనర్జీ సంస్థతోపాటు.. బాలయ్య చిన్న కూతురు తేజస్విని, అల్లుడు శ్రీ భరత్, వంకిన రమేశ్ చంద్ర చౌదరి, జాస్తి రామకృష్ణ చౌదరి, బిశ్వజిత్ మిశ్రా తదితరుల పేర్లను ఆంధ్రా బ్యాంక్ ఈ ప్రకటనలో పేర్కొంది.ఈ వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ విజయసాయిరెడ్డి కూడా స్పందించారు. బాలయ్య అల్లుడు శ్రీభరత్ టార్గెట్‌గా ట్విట్టర్‌లో విమర్శలు, సెటైర్లు పేల్చారు. దీంతో శ్రీభరత్ స్పందించారు.. విజయసాయికి ఓ ప్రకటన రూపంలో లేఖ రాశారు. అందులో ‘విజయసాయి రెడ్డి గారు మీ వ్యాఖ్యల పట్ల నిరశన వ్యక్తం చేస్తున్నాను. ఏ పి ట్రాన్స్ కో నుండి మా సంస్ధ వీబీసీ రెన్యూబుల్ ఎనర్జీ ప్రయివేట్ లిమిటెడ్ కు రావలసిన బకాయిలు దాదాపు రూ.3 కోట్లు. బ్యాంక్ కు మా సంస్థ ఇప్పటి వరకు బకాయిపడ్డ లోన్ వాయిదాలు దాదాపు రూ.2 కోట్లు. ట్రాన్స్ కో సకాలంలో చెల్లింపులు చేసి ఉంటే రుణ వాయిదాలు సమయానికి చెల్లించేవాళ్ళం. కానీ ఆర్దిక ఇబ్బందులు కారణంగా ప్రభుత్వం బకాయిలు చెల్లించలేని పరిస్థితి లో ఉన్న విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా, నేను ప్రజల డబ్బును దొంగిలించినట్లు నిందలు వేయడం చాలా విచారకరం. మన రాష్ట్రంలో చాలా మంది వ్యాపారస్తులు బిల్లులు రాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. కావున మీ సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం. ఇలాంటి వ్యాఖ్యలు సమాజానికి మంచివికావనేది నా అభిప్రాయం’అన్నారు.ఇంతకీ విజయసాయి ఏమన్నారంటే..‘నందమూరి బాలక్రిష్ణ చిన్నల్లుడు, విశాఖ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీభరత్ కుటుంబం రూ.13 కోట్లు పైచిలుకు బకాయి పడ్డట్టు ఆంధ్రా బ్యాంక్ పేపర్లలో ఆస్తుల వేలం ప్రకటన ఇచ్చింది. చంద్రబాబు దొంగల ముఠా, ఆయన బీజేపీ లోకి పంపిన వాళ్లు అంతా కలిసి లక్ష కోట్ల మేరకు బ్యాంకులను ముంచారు’అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. దీనికి శ్రీభరత్ కౌంటర్ ఇచ్చారు.