వివాదంలో స్టార్ హీరో సినిమా
బెంగళూర్,
కోలీవుడ్ టాప్ స్టార్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం బిగిల్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన తేరి (తెలుగులో పోలీస్), మెర్సల్ (తెలుగులో అదిరింది) సినిమాలు ఘనవిజయం సాదించటంతో బిగిల్‌పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండగా తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా కథ తనదే అంటూ ఓ రచయిత, దర్శకుడు తెలంగాణ రచయితల సంఘంలో కంప్లయింట్ చేశాడు. తెలుగులో పలు షార్ట్ ఫిలింస్‌కు దర్శకత్వం వహించిన నంది చిన్ని కుమార్ అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేస్తున్నాడు. అంతేకాదు బిగిల్ చిత్రయూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నాడు.అయితే తన కథను పూర్తిగా బిగిల్ యూనిట్ తీసుకోలేదని, కథలోని మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకొని వారు కథా కథనాలు సిద్ధం చేసుకున్నారు ఆరోపిస్తున్నాడు చిన్ని కుమార్. చిన్న కుమార్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన తెలంగాణ రచయిత సంఘం విచారణ చేపట్టింది. ఇదే కాదు బిగిల్ సినిమా తమిళనాడులోనూ ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటోంది. దర్శకుడు కేపీ సెల్వ కూడా బిగిల్ కథ నాదే అంటూ మద్రాసు హైకోర్టు ఆశ్రయించాడు.ఇలాంటి వివాదాలు విజయ్‌కి కొత్తేం కాదు. దాదాపు విజయ్ సినిమాలన్నీ చాలాకాలంగా రిలీజ్‌కు ముందు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నాయి. ముఖ్యంగా జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం విజయ్ సినిమాలు రిలీజ్ విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కొన్నాయి. విజయ్ గత చిత్రం సర్కార్ కూడా రిలీజ్ కు ముందు కాపీ ఆరోపణలు ఎదుర్కొందిఅయితే రిలీజ్ విషయంలో అడ్డంకులు ఉండొద్దన్న ఉద్దేశంతో చిత్రయూనిట్ చర్యలు తీసుకోవటంతో సర్కార్ అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఇప్పుడు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కాపీ ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగిల్, ఈ వివాదం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో అట్లీ దర్శకత్వంలో ఏజీఎన్ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విజయ్‌కి లక్కీ టైంగా చెప్పుకునే దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు.