ఇప్పడు ఫెయిలే...చంద్రబాబు పై సోషల్ మీడియాలో సెటైర్లు
విజయవాడ,
ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో అభివృద్ది మాటేమో కానీ, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీంతో ఆయన వంగి వంగి దణ్ణాలు పెట్టినా కూడా ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును పట్టించుకోలేదు. దీంతో ఓటమి పాలయ్యారు. అదికూడా 23 మంది ఎమ్మెల్యేలకే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది. ఇక, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఐదు మాసాలు పూర్తయ్యాయి. ప్రభుత్వంలోకి వచ్చిన వైసీపీకి ఐదు నెలలు లా అయితే నిండాయో .. విపక్షంలో ఉన్న టీడీపీకి కూడా అంతే సమయం పూర్తి అయింది. మరి ఐదు నెలల కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు అనుసరించిన వ్యూహం ఏంటి?ప్రభుత్వం ఏదైనా ప్రజావ్యతిరేక నిర్ణయం తీసుకుంటే దీనిని చంద్రబాబు నిలువరించారా ? అనేది కీలక ప్రశ్నగా మారింది. ఈ విషయంపైనే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ చర్చ సాగుతోంది. అదే సమయంలో టీడీపీలోనూ అంతర్గతంగా చర్చకు వస్తోంది. నిజం చెప్పాలంటే.. జగన్ ఈ ఐదు మాసాల సమయంలో ప్రజలకు వ్యతిరేకంగా ఎక్కడా ఎలాంటి నిర్ణయం తీసుకున్న పరిస్థితి లేదు. తనను తాను నిరూపించుకునే క్రమంలో ఆయన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంపైనే దృష్టి పెట్టారు తప్పితే.. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టలేదు. అదే సమయంలో కుంటుపడిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను లైన్‌లో పెట్టాలని భావించారు.ఈ క్రమంలోనే రివర్స్ టెండరింగ్స్‌ను ఎంచుకున్నారు. దీంతో ప్రతిపక్షనేత చంద్రబాబుకు విమర్శించే అవకాశం ఎక్కడా లభించలేదు. అయితే, గోదావరి, కృష్ణాలకు ఒకే సారి వరద రావడం, తుఫాను ప్రభావంతో పోలవరం సహా ఉభయ గోదావరి జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు మునిగినప్పుడు చంద్రబాబు అక్కడ పర్యటించారు. ఇది మినహా ప్రజల పక్షాన మాట్లాడేందుకు చంద్రబాబుకు అవకాశం రాలేదు. పోతే.. పార్టీని నిలబెట్టుకునేందుకు, పార్టీ నాయకులను నిలబెట్టుకునేందుకు మాత్రం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఐదు మాసాల్లోనూ పార్టీని నిలబెట్టుకునేందుకు ఉద్యమాలు చేశారు.ఆత్మకూరు ఘటన దీనిలో భాగమే. ఇక, యురేనియం తవ్వకాల విషయం కేంద్ర పరిధిలోది కావడంతో చంద్రబాబు మౌనం వహించారు. ఇక, తన అనుకూల మీడియాపై అప్రకటిత నిషేధం విధించినప్పుడు చంద్రబాబు గళం విప్పారు. అదే సమయంలో సచివాలయ ఉద్యోగాల భర్తీలో పేపర్ లీక్ ఆరోపణలు వచ్చినా.. చంద్రబాబు దీనిని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోయారు. మొత్తంగా చూస్తే.. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు పనిలేకుండా పోయిందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.