నదుల అనుసంధానం దిశగా జగన్ అడుగులు
విజయవాడ,
గోదావరి–కృష్ణా–పెన్నా లింక్ ప్రాజెక్టును ఏపీ సొంత ప్రాజెక్టుగానే చేపట్టాలని ఆ రాష్ట్ర సీఎం జగన్ విధాన నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 26న ఈ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయాలని ముహూర్తం కూడా ఖరారు చేశారు. పూర్తిగా ఏపీ భూభాగం నుంచే రోజుకు 4 టీఎంసీలు తరలించి రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేసే పనిని వ్యాప్కోస్‌కు అప్పగించారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు వైఎస్ జగన్ తన మంత్రులు, అధికార బృందంతో జూన్ 28న ప్రగతి భవన్‌కు వచ్చి గోదావరి–కృష్ణా–పెన్నా బేసిన్ల లింక్ ప్రాజెక్టుపై చర్చలు జరిపారు. అదే రోజు సాయంత్రం జలసౌధలో తెలంగాణ, ఏపీ ఇరిగేషన్ ఇంజనీర్లు భేటీ అయి నీటి తరలింపు అలైన్‌మెంట్లపై చర్చించారు.ఏపీతో ఉమ్మడి ప్రాజెక్టుగా గోదావరి–కృష్ణా–పెన్నా లింక్ చేపట్టాలని కేసీఆర్ మొదటి నుంచి అనుకుంటున్నారు. తెలంగాణ ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు సుముఖంగా లేకున్నా ఉమ్మడి ప్రాజెక్టుగా చేపట్టేందుకే కేసీఆర్ మొగ్గు చూపారు. కానీ ఇద్దరు సీఎంల మధ్య అవగాహన ఎలా ఉన్నా భవిష్యత్‌లో తలెత్తే సమస్యలు, రాజకీయంగా వచ్చే ఆరోపణలకు తావివ్వొద్దనే జగన్ సొంత ప్రాజెక్టుగానే లింక్ పనులు చేయాలని నిర్ణయించారు.తెలంగాణ భూభాగం నుంచి గోదావరి–కృష్ణా–పెన్నా లింక్ చేపడితే భవిష్యత్‌లో చాలా సమస్యలు వస్తాయని ఏపీ రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం చేసిన హెచ్చరికలను ఆ రాష్ర్ట సీఎం జగన్ పరిగణనలోకి తీసుకున్నారు. తెలంగాణ భూభాగం నుంచి కాలువ ఉంటే.. అక్కడి కరువు పీడిత ప్రాంతాల రైతులు ఆ నీటిని మోటార్లు, ఇతర మార్గాల ద్వారా మళ్లించుకుంటారని, సాగర్, శ్రీశైలం మీదుగా నీటిని ఎత్తిపోసే క్రమంలో తెలంగాణ నిర్మించిన ప్రాజెక్టులకు నీటిని ఇవ్వాల్సి ఉంటుందని ఏపీ రిటైర్డ్ ఇంజనీర్లు వివరించారు. ఇవన్నీ దాటుకొని రోజుకు 2 టీఎంసీల నీళ్లు కూడా వచ్చే అవకాశం లేదని, ఆ ప్రతిపాదనతో ఏపీకి మంచికన్నా చెడే ఎక్కువగా జరుగుతుందని హెచ్చరించారు. దానికి బదులుగా పోలవరం నుంచి నీటిని ఎత్తిపోయడమే ఏపీకి మంచిదంటూ పూర్తిస్థాయి అలైన్‌మెంట్‌ను జత చేసి జగన్‌కు లేఖ రాశారు. దీంతో తెలంగాణతో ఉమ్మడి ప్రాజెక్టుగా చేపడితే 400 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం లేదని జగన్ అంచనాకు వచ్చినట్టు తెలిసింది.ప్రగతి భవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులు సమావేశమగా, జలసౌధలో మరోసారి ఇంజనీర్లు సమావేశమయ్యారు. తర్వాత జులై 9న జలసౌధలో ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు మరోసారి భేటీ అయి ఐదు అలైన్‌మెంట్లపై చర్చించారు. ఒక్కో రాష్ట్ర భూభాగం నుంచి ఒక్కో అలైన్‌మెంట్‌ను ఫైనల్ చేసి, పూర్తిస్థాయి ఎస్టిమేషన్లతో ఆయా రాష్ట్రాల సీఎంలకు నివేదిక ఇచ్చేందుకు అదే నెల 15న మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఇంజనీర్ల మధ్య భేటీ వాయిదా పడుతూనే వస్తోంది. రెండు, మూడు సార్లు మీటింగ్ డేట్ ఫైనల్ చేసినా వివిధ కారణాలతో రద్దయ్యింది.గోదావరి నది నుంచి ఏటా 2,500 టీఎంసీల నుంచి 3 వేల టీఎంసీల వరకు నీళ్లు వందరోజుల వ్యవధిలో సముద్రంలో కలుస్తున్నాయి. సీడబ్ల్యూసీ గేజ్ డేటా ప్రకారం 75 రోజులపాటు పోలవరం వద్ద భారీగా మిగులు జలాలు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తంగా 75 శాతం డిపెండబులిటీని లెక్కించినా పోలవరం ఫోర్ షోర్ నుంచి వంద రోజుల్లో రోజుకు 4 టీఎంసీల చొప్పున 400 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశముందని రిటైర్డ్ ఇంజనీర్లు సూచించారు. గోదావరి నదిపై మహారాష్ట్ర, తెలంగాణ ప్రాజెక్టులన్నీ నిర్మించినా ఈ నీళ్లు పోలవరం వద్ద అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. రిటైర్డ్ ఇంజనీర్ల ప్రతిపాదనను సీరియస్గా తీసుకున్న ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించి సొంత ప్రాజెక్టుగానే లింక్ పనులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గోదావరి నీళ్లను కృష్ణా నదిలో కలపకుండా పంపుహౌస్‌లు, కాలువలు, టన్నెళ్ల ద్వారానే పెన్నా బేసిన్‌కు తరలించనున్నారు.గోదావరి-పెన్నా బేసిన్ల లింక్‌పై సీడబ్ల్యూసీ అనుబంధ సంస్థ వ్యాప్కోస్ గతంలోనే డీపీఆర్ రెడీ చేసింది. రూ.6,020 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టవచ్చని పేర్కొంది. అయితే డీపీఆర్ అసమగ్రంగా ఉందని, పర్యావరణ, హైడ్రాలజీ తదితర పర్మిషన్లు లేకుండానే చంద్రబాబు ప్రభుత్వం ఈ పనులను మొదలు పెట్టిందని జలవనరుల శాఖ నియమించిన ఎక్స్‌పర్ట్ కమిటీ తేల్చింది. దీంతో జగన్ ఆ ప్రాజెక్టును రద్దు చేసి కొత్తగా ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఏపీ జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈమేరకు వ్యాప్కోస్‌కు లేఖ రాశారు. కొత్తగా డీపీఆర్ తయారు చేయాలని, అక్టోబర్ నెలాఖరులోగా తమకు అందజేయాలని కోరారు.