ఏపీలో కే12 విద్యా విధానం
విజయవాడ,
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యావ్యవస్థలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ఇందులో భాగంగా పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు విద్యా సంస్కరణలకు బాలకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా పాఠశాల విద్యలో కే12 విధానాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేయడంపైనా చర్చించారు. ఒకవేళ విలీనమైతే ఇంటర్‌ను సీనియర్ సెకండరీ విద్యగా పరిగణించనున్నారు. ఒక వేళ కే12 విధానం అమల్లోకి వస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య(ఎల్‌కేజీ, యూకేజీ)ను ప్రారంభించాల్సి ఉంటుంది.అయితే ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అమల్లో ఉన్నందున వాటిని బలోపేతం చేయడమా? లేదా.. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వప్రాథమిక విద్యను ఏర్పాటు చేయాలా? అనే విషయంలో ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.పాఠశాలల్లో విద్యార్థి-ఉపాధ్యాయుల నిష్పత్తి, మౌలిక వసతుల కల్పన, పరీక్షల్లో సంస్కరణలు, ప్రాథమిక పాఠశాలల్లో పరిశోధన, శిక్షణ కేంద్రాల ఏర్పాటు, ఖాళీల భర్తీ, ఉపాధ్యాయులకు శిక్షణ, పాఠశాలల ఏకీకరణ వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు. అక్టోబరు 29న సంబంధిత కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి అందజేయనుంది. నివేదికపై సీఎం అభిప్రాయం, సూచనలకు అనుగుణంగా తుది నివేదికను రూపొందించనున్నారు.