దేశ ఆర్ధిక రంగంలో వ్యవసాయానిదే కీలక పాత్ర
హైదరాబాద్
దేశ ఆర్ధిక రంగంలో వ్యవసాయానిదే కీలక పాత్ర అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెల్లడించారు. జనాభాలో 54.6శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నిమగ్నమై ఉన్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నాయన్నారు. మంత్రి స్వయంగా రైతు కావడం ఆనందంగా ఉందని రాజన్ వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో జరిగిన రెండు రోజుల వర్క్‌షాప్ సందర్భంగా ఆమె ప్రసంగించారు. మంత్రి వ్యవసాయ క్షేత్రాన్ని, జోగులాంబ ఆలయాన్ని త్వరలోనే సందర్శిస్తానని గవర్నర్ ఈ సందర్భంగా తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుని వ్యవసాయ మంత్రి మామిడి పండ్లను యూరోప్ దేశాలకు ఎగుమతి చేయడం రైతులకు స్ఫూర్థి దాయకమని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో వేరుశెనగ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మంత్రి నిరంజన్ రెడ్డి కృషిని అభినందిస్తున్నానన్నారు. యువత వ్యవసాయ రంగం వైపు చూపు మరల్చేలా ప్రోత్సహించాలని గవర్నర్ ఈ సందర్భంగా కోరారు. వ్యవసాయం లాభదాయకం అయితేనే వారు ఇటువైపు అడుగులు వేస్తారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో లాభదాయక వ్యవసాయం - యువత పాత్ర అనే అంశంపై రెండురోజుల వర్క్ షాప్ ప్రారంభం సంధర్భంగా ఆమె ప్రసంగించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర జనాభాలో 60 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని గవర్నర్ తమిళిసై ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రుణ మాఫీ, వ్యవసాయ యాంత్రీకరణ, సబ్సిడీ విత్తనాలు, సూక్ష్మ సేద్యం, వ్యవసాయ ప్రయోజనాల కోసం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా. రైతుబంధు, రైతు బీమా వంటి అనేక సహాయ కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు.మిషన్ కాకతీయతో చెరువులను పునర్నిర్మించి చిన్ననీటి పారుదల వ్యవస్థను క్రమబద్దీకరించడం జరిగిందని తమిళిసై వెల్లడించారు. ప్రతి మండలానికి ఒక వ్యవసాయాధికారిని, ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించి రైతులకు సేవలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం పంట కాలనీలను ప్రోత్సహిస్తోందన్నారు. అయితే వ్యవసాయం వైపు యువత ఆసక్తి క్షీణిస్తుండడం విచారకరమన్నారు. వ్యవసాయ రంగ శ్రేయస్సు కోసం యువత సహకారం తప్పనిసరి అని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం వైపు యువతను ఆకర్షించడం ఇప్పుడు ప్రధానమయిన అంశమని స్పష్టం చేశారు.వ్యవసాయంతోపాటు పాడి వ్యవసాయం, తేనెటీగ సంస్కృతి, పుట్టగొడుగుల సాగు, సెరికల్చర్, చేపల పెంపకం వంటి వ్యవసాయానికి సంబంధించిన రంగాలను ప్రోత్సహించడం ద్వారా యువతను ఈ రంగం వైపు ఆకర్షించగలుగుతామని పేర్కొన్నారు. వ్యవసాయాధారిత ఉత్పాదక యూనిట్లను, వనరుల లభ్యతను తెలుసుకునేందుకు పంచాయతీ స్థాయిలో గ్రామీణ యువతకు శిక్షణనివ్వాల్సిన అవసరముందని గవర్నర్ పేర్కొన్నారు. వ్యవసాయం లాభసాటి అని భావిస్తే గ్రామీణ యువత దీనిని వృత్తిగా స్వీకరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వివిధ విజయవంతమైన వ్యవసాయ సంబంధిత క్షేత్రాలను యువతకు పరిచయం చేయడం, వర్క్‌షాపులు నిర్వహించడం ద్వారా యువతను వ్యవసాయం వైపు ప్రేరేపించాలని సూచించారు.