నత్తతో పోటీపడుతున్న రహదారుల నిర్మాణాలు
తిరుపతి,
చిత్తూరు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆర్‌డీఎఫ్ కింద 2018–19లో 59 పనులు మంజూరయ్యాయి. ఇందులో 31 పనులు పూర్తిచేయగా, 28 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ పనులకు రూ.1948.7 లక్షలు ఖర్చవుతుందని అంచనా. జిల్లాలో జరుగుతున్న రహదారులన్నీ నిబంధనల ప్రకారం నిర్మించాలి. తారు రోడ్లకు ఇరువైపులా రోలింగ్ చేయకుండా వదిలేస్తున్నారు. తారు రోడ్లలో రెండు పొరలుగా తారు వేయాలి. ఈ పనులు అలా జరగడం లేదు. కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు కుమ్మక్కై నాసిరకమైన రోడ్లను వేస్తున్నారు. తారురోడ్లను రెండు పొరలుగా వేయకపోవడంతో ఎక్కడికక్కడ కొద్దిరోజులకే తారు ఎండ కు కరిగిపోతోంది. పర్యవేక్షించాల్సిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..సీఆర్‌ఆర్ కింద 363 పనులకుగాను 196 పూర్తయ్యాయి. 167 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. సీఆర్‌ఆర్ (ఎస్సీ సబ్‌ప్లాన్)లో 313 పనులకు 143 పూర్తికాగా, 170 పెండింగ్‌లో ఉన్నాయి. ఎంజీఎన్‌ఆర్‌జీఎస్‌లో 195 పనులకుగాను 115, అంగన్‌వాడీ భవన నిర్మాణాల్లో 856కు గాను 616, పంచాయతీ భవనాలు 587కు 158, ఎంజీఎన్‌ఆర్‌జీఎస్ కన్వర్జెన్సీలో సీసీరోడ్లు 12,743 పనులకు 8,455 పెండింగ్‌లో ఉన్నాయి. పంచాయతీరాజ్ పరిధిలోని పనులు ఏళ్ల తరబడి జరుగుతుండడంతో విమర్శలు వెలువెత్తుతున్నా యి. సీఆర్‌ఆర్ ఎస్సీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన పనుల్లో చిత్తూరు పీఆర్‌ఐ, మదనపల్లె, తిరుపతి పరిధిలో పనులు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. పంచాయత్‌రాజ్ శాఖలోని పీఆర్‌ఐ, పీఐయూ, క్వాలిటీ కంట్రోల్ శాఖల మధ్య సమన్వయలోపం ఉండడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.2017–18 సంవత్సరాల్లో చిత్తూరు, మదనపల్లె, తిరుపతికి గత ఆర్థిక సంవత్సరంలో 12,743 పనులు మంజూరయ్యాయి. వాటిలో 4,288 పనులు పూర్తి చేశారు. ఇంకా 8,455 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది మరో 29 పనులు మంజూరయ్యాయి. మొత్తం 8,484 పనులు ఉండగా, అందులో 838 పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన వాటిలో 2,242 పనులు జరుగుతుండగా, 5,388 పనులు ఇప్పటివరకు ప్రారంభమే కాలేదు. ఈ పనులకు విడుదలైన రూ.1.45 కోట్లలో ఇప్పటివరకు పూర్తయిన పనులకు రూ.85 లక్షలు ఖర్చు చేశారు. సకాలంలో నిధులను ఖర్చు చేయకపోవడంతో ఆ నిధులు వెనక్కు వెళ్లే పరిస్థితి నెలకొంటోంది.