ఇంట గెలవలేకపోతున్న కమలం నేతలు
విజయవాడ,
బీజేపీలో అగ్రనాయకులుగా చలామణి అవుతున్న వారు సొంత రాష్ట్రాల్లో మాత్రం చతికలపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తమ వ్యూహాలు, ఎత్తుగడలతో బీజేపీకి విజయం సాధించి పెట్టిన నేతలిద్దరూ సొంత రాష్ట్రాల్లో మాత్రం సత్తా చూపలేకపోతున్నారు. సొంత రాష్ట్ర ప్రజలు వీరిని జాతీయ నాయకులుగా గుర్తించకపోవడమే కారణమా? లేక ఇతర రాష్ట్రాల్లో లేని పరిస్థితులు వీరి సొంత రాష్ట్రాల్లో ఉన్నాయా? దీంతో పాటు వీరిద్దరికి అస్సలు పొసగడం లేదు. పైకి నవ్వుతూ ఇద్దరూ ఒకటిగా కన్పిస్తున్నా లోపల మాత్రం కత్తులు నూరుకుంటున్నారట.వారే బీజేపీ అగ్రనేతలు రాంమాధవ్, మురళీ ధరరావు. మురళీధరరావు విషయాన్ని తీసుకుంటే ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అంచెలంచెలుగా బీజేపీలో ఎదిగారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మురళీధరరావు పార్టీ కేంద్ర నాయకత్వానికి నమ్మినబంటు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అత్యంత నమ్మకమైన నేత. గతంలో మురళీధరరావు రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ పార్టీ ఇన్ ఛార్జిగా పనిచేశారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రం కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా ఉన్నారు. కర్ణాటకలో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చింది.కానీ మురళీధరరావు సొంత రాష్ట్రమైన తెలంగాణలో బీజేపీ చతికల పడింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలో 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కొంత సానుకూల ఫలితాలను సాధించింది. ఇక రామ్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రికి చెందిన వ్యక్తి. ఆయన కూడా ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. జమ్మూకాశ్మీర్ లో బీజేపీ, పీడీపీ అధికారం చేపట్టడానికి రాంమాధవ్ వ్యూహమే కారణం. అమిత్ షాకు నమ్మకమైన నేత. అయితే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు.అయితే వీరిద్దరి మధ్య విభేదాలున్నాయని చెబుతారు. మురళీధరరావు సొంత రాష్ట్రమైన తెలంగాణలో రాం మాధవ్ తరచూ పర్యటిస్తుంటారు. బీజేపీలోకి చేరికల్లో రాం మాధవ్ కీలక పాత్ర పోషిస్తారు. తెలంగాణ నేతలు సయితం ఎక్కువగా రాంమాధవ్ నే సంప్రదిస్తుండటం విశేషం. ఇది మురళీధరరావుకు మింగుడుపడటం లేదంటున్నారు. అందుకే ఆయన ఇటీవల రాంమాధవ్ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా పర్యటిస్తున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఇతర రాష్ట్రాల్లో మీసాలు మెలిసే ఈ ఇద్దరు బీజేపీ నేతలు సొంత రాష్ట్రాలకు వచ్చే సరికి తమ వ్యూహాలను అమలుపర్చలేక, పార్టీకి విజయం సాధించపెట్టలేక పోతున్నారు.