చిదంబరానికి ఊరట.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ
న్యూ ఢిల్లీ
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఊరట లభించింది. ఇవాళ సుప్రీంకోర్టు చిదంబరానికి బెయిల్ మంజూరీ చేసింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో.. మాజీ కేంద్ర మంత్రి బెయిల్ కోసం సుప్రీం తలపు తట్టారు. అయితే ఇవాళ సుప్రీం బెయిల్ ఇచ్చినా.. కాంగ్రెస్ నేత మాత్రం ఇంకా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కస్టడీలోనే ఉన్నారు. ఇద్దరు సాక్షి సంతకాలతో చిదంబరం.. లక్ష రూపాయాల బాండ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. చిదంబరం తన పాస్‌పోర్ట్‌ను ట్రయల్ కోర్టులో అప్పగించాలి. కోర్టు అనుమతితోనే ఆయన విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు అక్రమ పద్ధతిలో విదేశీ పెట్టుబడులు అందే విధంగా చిదంబరం అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీన చిదంబరాన్ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో చిదంబరం అవినీతికి పాల్పడ్డారు. ఐఎన్ఎక్స్ మీడియాకు పర్మిషన్ ఇచ్చేందుకు ఆయన లంచం తీసుకున్నారు. దీంతో చిదంబరంపై 2017, మే 15వ తేదీన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అదే ఏడాది ఈడీ కూడా మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈడీ కేసు విచారణలో భాగంగా చిదంబరాన్ని ఇంకా కస్టడీలోనే ఉంచారు.