జగన్నాటకంలో చిత్తవుతున్నబతుకులు - ఇసుక మాఫియాపై టీడీపీ ఆందోళన
- 24న రాజమహేంద్రవరంలో రిలే దీక్ష
- వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ
రాజమహేంద్రవరం.అక్టోబర్ 22 (న్యూస్ పల్స్)
రాష్ట్రంలో జరుగుతున్న జన్నాటకంలో కార్మికుల బతుకులు చిత్తవుతున్నాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. నూతన ఇసుక పాలసీతో కార్మికులను నెలల తరబడి పస్తులుంచి... ఆకలి కోసం అన్నం దొంగిలించేలా వారిని తయారు చేసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఇసుక విధానాన్ని నిరసిస్తూ ఈనెల 24వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపడుతుందన్నారు. స్థానిక కోటగుమ్మం వద్ద రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని సిటీ, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒకరోజు రిలే దీక్ష చేస్తారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న కక్ష తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాత ఇసుక పాలసీని రద్దు చేసి.. కొత్త పాలసీ పేరుతో అసలు ఎవరికి ఇసుక అందుబాటులో లేకుండా చేసారని ధ్వజమెత్తారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో భవానీతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శాప్ మాజీ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మార్ని వాసుదేవ్, టిఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు నక్కా చిట్టిబాబు తదితరులు మాట్లాడారు. ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వల్ల పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌పై సామాన్యులకు అవగాహన లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేక ఆకలితో కుటుంబాల సహా పస్తులుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. రాజమహేంద్రవరం ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నప్పటికీ స్థానికులకు మాత్రం అందుబాటులో లేకుండా విజయవాడ, గుంటూరు వరకు ఇసుక అక్రమంగా తరలిపోతోందని ఆరోపించారు. బుకింగ్ ప్రారంభించిన రెండు నిముషాల్లోనే నో స్టాక్ బోర్డులు పెడుతున్నారని, దీనిపై తహశిల్దార్లు, విఆర్‌ఓలు కూడా సరైన సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ఇసుక ర్యాంపుల్లో విఆర్‌ఓలు, వైఎస్‌ఆర్ సిపి నాయకులు కుమ్మక్కై అవినీతి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. ప్రజలను కష్టపెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆదేశాల మేరకు 24వ తేదీ గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే రిలే దీక్షలో టీడీపీ నాయకులు, భవన నిర్మాణ కార్మికులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. గతంలో తుగ్లక్, హిట్లర్ పాలన గురించి గతంలో పుస్తకాల్లో చదువుకున్నామని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అవతవకల్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులుపెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. సామాన్యుడు రాష్ట్రంలో బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. వ్యాపారాలు స్తంభించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంలో టీడీపీ ఉచితంగా ఇసుక ఇస్తే విమర్శలు చేసిన వైసిపి నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఆదిరెడ్డి నిలదీసారు. ప్రజల సంక్షేమం, అభ్యున్నతిని పక్కన పెట్టి రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతీ ఇసుక ర్యాంపుల్లో ఇద్దరు వ్యక్తుల్ని నియమిస్తామని వేబిల్లుతో పాటు రసీదును బిల్లింగ్ చేసి ఇసుకను రవాణా చేయకపోతే ఎక్కడికక్కడ నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. వైసిపి నాయకులు ఇసుకను దోచుకోవడానికే ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టినట్టుగా ఉందని ఎద్దేవా చేసారు. వాలంటీర్లు డివిజన్లలో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారని గతంలో ఇళ్లు మంజూరైన వారి వద్దకు వెళ్లి మళ్లీ సర్వే చేయాలంటూ ఆందోళనకు గురిచేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు జాబితాను స్థానిక ఎమ్మెల్యేలకు కూడా పంపాలని ప్రభుత్వానికి సూచించారు. యర్రా వేణుగోపాల రాయుడు మాట్లాడుతూ తునిలో ఆంధ్రజ్యోతి విలేకరిని దారుణంగా హత్య చేసారని, పత్రికా స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని టీడీపీ తరపున తీవ్రంగా ఖండించారు. ఇసుక పాలసీ, అమరావతి రాజధాని, మద్యం విధానాలపై ప్రభుత్వం తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు. చిట్టిబాబు మాట్లాడుతూ ఐదు నెలలు జగన్‌కు సమయం ఇచ్చినా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తేలేకపోయారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, కోరుమెల్లి విజయశేఖర్, మొకమాటి సత్యనారాయణ, మరుకుర్తి రవియాదవ్, యాళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.