వైసీపీలోకి రామసుబ్బారెడ్డి...
విజయవాడ,
కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీకి ఝలక్ ఇస్తూ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తన దారి తాను చూసుకున్నారు. చంద్రబాబును కలిసి మరీ తాను పార్టీ మారుతున్నట్లు చెప్పేశారు.. లాంఛనంగా ఢిల్లీలో బీజేపీలో చేరిపోయారు. ఆది పార్టీని వీడటంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పెద్ద దిక్కుగా ఉంటారని టీడీపీ భావిస్తోంది.ఆదినారాయణ రెడ్డి బీజేపీతో సంప్రదింపులు జరుపుతుండగానే రామసుబ్బారెడ్డి కూడా టీడీపీని వీడతారనే ప్రచారం జరిగింది. ఆయన వైఎస్సార్‌సీపీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. త్వరలోనే పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరిగింది. ఈలోపు ఎయిర్‌పోర్ట్‌లో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనం.. చిన్న పలకరింపులతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. త్వరలోనే జగన్ పార్టీలోకి వెళ్లడం ఖాయమని చర్చ నడుస్తోంది. జగన్‌తో రామసుబ్బారెడ్డి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యింది.ఈ ఫోటో వ్యవహారంలో రామసుబ్బారెడ్డి వర్గం కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆగష్టు 16న రామసుబ్బారెడ్డి అమెరికాలో ఉన్న తన కూతురి దగ్గరకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు. ఆయన వాషింగ్టన్‌లో విమానం దిగిన సమయంలోనే.. సీఎం జగన్ కూడా అమెరికా పర్యటనలో బాగాంగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఇద్దరు ఎదరుగా తారసపడటంతో.. రామసుబ్బారెడ్డి, జగన్‌లు పలకరించుకున్నారట. ఓ రెండు నిమిషాల పాటూ చిన్నపాటి చర్చ జరిగిందట. ఎవరో ఈ సీన్‌ను ఫోటో తీయడంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.రామసుబ్బారెడ్డి వైఎస్సార్‌సీపీలోకి వెళతారనే ప్రచారంతో టీడీపీ కూడా అప్రమత్తమయ్యిందట. అమెరికా పర్యటన నుంచి రాగానే రామసుబ్బారెడ్డి నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లారట. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి.. జగన్‌ను ఎయిర్‌పోర్టులో కలవడంపై క్లారిటీ ఇచ్చారట. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని అధినేతకు తేల్చి చెప్పారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అయితే కడప జిల్లాలో మాత్రం రామసుబ్బారెడ్డి పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోందట. మరి మాజీ మంత్రి తెలుగు దేశంలోనే కొనసాగుతారో.. లేక జగన్ పంచన చేరతారో చూడాలి.జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి-రామసుబ్బారెడ్డిలు ప్రత్యర్థులుగా ఉన్నారు. 2014లో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య కొద్దిరోజులు కోల్డ్ వార్ నడిచింది. రంగంలోకి దిగిన చంద్రబాబు.. ఇద్దరు నేతలతో చర్చలు జరిపి రాజీ చేశారు. జమ్మలమడుగు నుంచి రామసుబ్బారెడ్డి.. కడప లోక్‌సభ స్థానం నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు.. కానీ ఇద్దరికీ ఓటమి తప్పలేదు.