YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సిట్ తో నేతల్లో కష్టాలు...

సిట్ తో నేతల్లో కష్టాలు...

సిట్ తో నేతల్లో కష్టాలు...
విశాఖపట్టణం, అక్టోబరు 23,
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విశాఖ భూ కుంభకోణాల్లో దోషులను తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే సిట్‌కు ఎలాంటి పరిమితులు విధించకుండా.. స్వేచ్ఛగా విచారణ జరిపేలా మార్గదర్శకాలు జారీ చేసింది. నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. నవ్యాంధ్రలో ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని రూ.లక్ష కోట్ల విలువైన భూములను చెరబట్టేశారు. హుద్‌హుద్‌ను కూడా తట్టుకున్న విశాఖపట్నం.. టీడీపీ భూబకాసురులు సృష్టించిన భూదందాల విలయాన్ని మాత్రం తట్టుకోలేక చిగురుటాకులా వణికిపోయింది. ఆర్థిక రాజధానిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళతామని చెప్పిన పాలకులే భూ మాఫియాకు ద్వారాలు తెరిచి పాతాళానికి నెట్టేశారు. అధికారం అండతో  విచ్చలవిడిగా కబ్జాలకు తెగబడ్డారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రికార్డులను మాయం చేసి, తారుమారు చేసేసి మరీ అడ్డంగా భూములను తన్నుకుపోయారు.భూ కుంభకోణంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులపై చర్యలకు సిట్‌ సిఫార్సు చేసినా పట్టించుకోని సర్కారు తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులను మాత్రం బలి చేసేసింది. తహసీల్దార్‌ నుంచి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఐఏఎస్‌ స్థాయికి చెందిన  సుమారు 48 మందిపై క్రిమినల్‌ కేసుల నమోదుకు సిఫార్సు చేసింది. సుమారు 140 మంది వివిధ స్థాయి అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసింది. అసలు దోషుల్ని వదిలేయడం, బాధితులకు సరైన న్యాయం జరగకపోవడంతో.. మరోసారి దర్యాప్తు చేయించాలని  ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో బాధితుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వెల్లువెత్తాయి. మరో సిట్‌ వేసి సమగ్ర విచారణ చేపడతామని అప్పట్లో హామీ ఇచ్చిన జగన్‌.. దానికి కట్టబడి సిట్‌ ఏర్పాటు చేశారు. 2017 మే నెలలో భూముల రికార్డులు మాయమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కొన్ని వేల భూ రికార్డులు కనిపించడం లేదని స్వయంగా అప్పటి జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రకటించారు. విశాఖలో 2,45,896 ఫీల్డ్‌మెజర్‌మెంట్‌ బుక్స్‌ (ఎఫ్‌ఎంబీ)లు ఉండగా ఇందులో 16,735 ఎఫ్‌ఎంబీలు కనిపించకుండా పోయాయి. 3022 ఆర్‌ఎస్‌ఆర్‌లు ఉండగా అందులో 379 అదృశ్యమయ్యాయి. 3022 గ్రామాలకు సంబంధించి క్లియర్‌ మ్యాపుల్లో 233 గ్రామాల మ్యాపులు కనిపించకుండా పోయాయి. వీటిలో చాలా వరకు భీమిలి, మధురవాడ ప్రాంతాల్లోని భూములకు సంబంధించినవే ఉన్నాయి. ఇలా భూ కుంభకోణం బట్టబయలైంది. విశాఖ జిల్లా టీడీపీలో కీలకంగా ఉన్న నేతల్లో చాలామంది భూ దందాల ఆరోపణలు ఎదుర్కొన్న వారే. వీరిలో చాలా మందిపై బహిరంగ ఆరోపణలే వినిపించాయి. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌పైన ఏకంగా పోలీసు కేసు కూడా నమోదైంది. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేశారు. అయితే.. సిట్‌ బృందానికి నాటి టీడీపీ ప్రభుత్వం అనేక పరిమితులు విధించింది. విచారణను రికార్డులు ట్యాంపర్‌ అయిన భూములకే పరిమితం చేసింది. భూ ఆక్రమణలు, ముదపాక భూముల వ్యవహారం సిట్‌ పరిధిలోకి తీసుకురాకపోవడంతో బాధితుల్లో నైరాశ్యం అలముకుంది. విచారణపై అప్పటి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించిందో ఈ పరిమితులతో అర్థం చేసుకున్న ప్రజలు సిట్‌ను విశ్వసించలేదు.
అయినప్పటికీ.. గత సిట్‌కు 2875 ఫిర్యాదులందాయి. వీటిలో మూడొంతులు టీడీపీ నేతలపైనే వచ్చినట్లు బహిర్గతమైంది. ఇక వివిధ వర్గాల ప్రజలు, భూ బాధితులు కూడా టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతల భూకబ్జాలపైనే సిట్‌కు ఫిర్యాదులు చేశారు. సుదీర్ఘంగా సాగిన విచారణలో  వందలాది డాక్యుమెంట్లు, వేలాది భూ రికార్డులను పరిశోధించి..క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.  2018 జనవరి 29న ప్రభుత్వానికి సిట్‌ నివేదిక సమర్పించగా పది నెలలు తొక్కిపెట్టిన ప్రభుత్వం ఆ ఏడాది నవంబర్‌ 6న కేబినెట్‌ ముందుకు తీసుకొచ్చింది. కానీ అందులోని వివరాలు బహిర్గతం చేయకుండా కాలగర్భంలో కలిపేసింది.

Related Posts