ఇసుకాసుర హస్తం (పశ్చిమ గోదావరి )
ఏలూరు, అక్టోబర్ 23 (: ఇసుక అక్రమాలను నియంత్రించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. నాలుగు నెలల నుంచి ఇసుక కొరతతో తీవ్ర ఇక్కట్లు పడుతున్న జిల్లావాసులకు తక్కువ ధరకు ఇసుక అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. అంతా బాగానే ఉన్నా అక్రమార్కులు మాత్రం ఇసుక అక్రమ రవాణాకు అధికారులతో కలిసి నూతన దందాకు తెరతీశారు. నిబంధనల ప్రకారం టన్ను ఇసుక రూ.375కి, రవాణా ఛార్జీలను కలపి లబ్ధిదారులకు అందించాలి. కొందరు గనుల శాఖ అధికారులు, దళారుల సహకారంతో టన్ను ఇసుక రూ.750 విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ధరలకు రెట్టింపు మొత్తం లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం విమర్శలకు దారి తీస్తోంది. జిల్లాలోని అన్ని మండలాలకూ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎంపిక చేసిన రేవుల నుంచి ప్రభుత్వం ఇసుక సరఫరా చేస్తోంది. జిల్లావ్యాప్తంగా మీసేవ కేంద్రాల ద్వారా ఇసుకను అంతర్జాలంలో బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. అయితే రేవుల వద్ద అక్రమ వసూళ్లకు కొందరు దళారులు ప్రత్యేక కౌంటర్లను తెరిచారు. ప్రభుత్వం టన్ను ఇసుక రూ.375కి విక్రయిస్తుంటే కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలు వసూలు చేస్తున్నారు. అక్రమ మార్గంలో చేసే ఇసుక రవాణాకు కొందరు గనుల శాఖ అధికారులు లంచాలు తీసుకుని అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. వంద కిలోమీటర్ల మేర 20 టన్నుల ఇసుక రవాణాకు రూ.19,500 ఖర్చు అవుతుంది. కానీ అక్రమ మార్గంలో.. ఇసుక ధర మొదలు రేవు సిబ్బంది, గనులశాఖ అధికారులు, దళారుల మామూళ్లు వరకు అన్ని లెక్కలేసుకుంటే సామాన్య వినియోగదారుడికి ముచ్చెమటలు పడతాయి. ప్రభుత్వానికి ఇసుక అక్రమాలు అరికట్టాలనే సంకల్పం ఉన్నా దళారుల దాష్టీకాలు, గనుల అధికారుల అవినీతితో ఆ సంకల్పం ఆచరణకు నోచుకోవడం లేదు. ఒకవైపు ఇసుక దందా, మరోవైపు కృత్రిమ కొరత వినియోగదారులకు విసుగెత్తిస్తుంటే మరోవైపు సాంకేతిక సమస్యలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇసుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్న చాలామందికి ఇసుక లేదు అని చూపిస్తోందని వాపోతున్నారు. సమస్యను ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తెలియక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అధికారులు ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నల్లబజారులో ఇసుక కొనుగోలు చేయలేక నిర్మాణాలను మధ్యలోనే వదిలేసిన వారు ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అక్రమాలకు అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరుతున్నారు.