YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

 అగమ్య గోచరం (విజయనగరం)

 అగమ్య గోచరం (విజయనగరం)

 అగమ్య గోచరం (విజయనగరం)
విజయనగరం, అక్టోబర్ 23 : వర్షాలు లేవని పత్తి వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తరువాత కురిసిన భారీ వర్షాలతో పంట బాగా తడిచిపోయింది. దీంతో ఎలా అమ్ముకోవాలా...? అని తలలు పట్టుకుంటున్నారు. నాణ్యత లేదని కొనుగోలుకు వ్యాపారులు ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో మొదటి విడతగా 71 వేల క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రావాలి. ప్రస్తుతం 40 వేలకు పడిపోతోంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5,550. ఈ లెక్కన 30వేల క్వింటాళ్లకు జిల్లాలోని రైతులు సుమారు 15 కోట్ల వరకు నష్టపోతున్నారు. తడిచిన పత్తిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కూడా ముందుకు రావడం లేదు. క్వింటాలు రూ.5550లు కాగా తడిచి రంగు మారిందని రూ.3 వేలకు కూడా అడగటం లేదని రైతులు వాపోతున్నారు. రైతులకు ఇటీవల కురిసిన భారీ వర్షాలు నీటితో పాటు కన్నీరు తెప్పించాయి. సకాలంలో కురవక జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గింది. వర్షాలు లేవని వరి సాగుచేసే రైతులు ఆరుతడి, మెట్టు పంటలపై ఆసక్తి చూపారు. వాణిజ్య పంట పత్తి వేశారు. పంటబాగా పండింది. కానీ, భారీ వర్షాలతో పత్తి పంట బాగా తడిచిపోయింది. మొదటి విడత పంటను దసరా పండుగ నాటికి ఇంటికి చేర్చేవారు. ప్రస్తుతం పత్తి పంట వేసిన రైతులు పండిన పంటను ఎలా అమ్ముకోవాలా...? అని తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే పంటబాగా తడిచింది. నాణ్యత లేదు అని పంట కొనుగోలుకు వ్యాపారులు ముఖం చాటేస్తుండటమే కారణం. జిల్లాలో ఈఏడాది రైతులు 11,462 హెక్టార్లలో వేశారు. సాధారణంగా 14,208 హెక్టార్లలో పత్తిపంట సాగవ్వాలి. కానీ 3 వేల హెక్టార్లలో పత్తి పంట తగ్గింది. వాతావరణం అనుకూలించకపోవడమే కారణం. జిల్లాలో సాగు చేస్తున్న పత్తిపంటలో అత్యధిక శాతం సాలూరు, పాచిపెంట, రామభద్రపురం మండలాల్లోనే ఉంది. 60 శాతం అంటే 6208 హెక్టార్లలో పత్తి పంట రైతులు సాగు చేస్తున్నారు. ఇక్కడ కాకుండా గజపతినగరం, దత్తిరాజేరు, పార్వతీపురం ప్రాంతాల్లో కూడా పండిస్తున్నారు. వరి తరువాత మొక్కజొన్న, పత్తి పంటలనే సాలూరు ప్రాంత రైతులను ఆదుకుంటాయి. అలాంటిది ఈ ఏడాది అకాల, భారీ వర్షాలు పత్తిరైతును చిత్తుచేశాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి పంట బాగా తడిచింది. దీంతో మొదటి విడతగా ఏరాల్సిన పత్తి జిల్లాలో సుమారు 30 వేల క్వింటాళ్ల వరకు పంట దిగుబడి తగ్గింది. జిల్లాలో సాగవుతున్న 11,452 హెక్టార్లలో ఒక్కో ఎకరాకు మొదటి దశగా రెండు నుంచి మూడు క్వింటాళ్ల పత్తి వస్తుంది. కానీ, వర్షాల కారణంగా కింటాలు నుంచి క్వింటాన్నర మాత్రమే పత్తి దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. అది కూడా తడిచిపోవడంతో నాణ్యత పడిపోయింది.

Related Posts