ఇద్దరు పిల్లలు దాటితే... ఆశలు వదులుకోవాల్సిందే
గౌహాతి, అక్టోబరు 24
మీరు అస్సాంలో నివసిస్తున్నారా? బోల్డంత మంది పిల్లల్ని కనాలనే కోరిక మీకుందా? అయితే ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వం ఇచ్చే పథకాలపై ఆశలు వదులుకోవాలి. లేదంటే మీ కోరికనైనా చంపుకోవాలి. ఎందుకంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మందిని కంటే ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదని అస్సాం సర్కార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బోనందా సోనోవాల్ నేతృత్వంలో సమావేశమైన మంత్రిమండలి ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదన్న కొత్త నిబంధనకు ఆమోద ముద్ర వేసింది. ఈ నిబంధన 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఎవరైనా అతి తెలివికి పోయి ఉద్యోగం వచ్చాక నచ్చినంత మంది పిల్లల్ని కంటామన్నా కూడా కుదరదు.ఉద్యోగంలో చేరిన తర్వాత మూడో బిడ్డను కన్నారని తెలిసిన మరు క్షణం వారిని ఇంటికి సాగనంపేలా కఠినమైన నిబంధనల్ని రూపొందించింది. ఈ కొత్త విధానం ప్రకారం ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఇక వారికి వర్తించవు. గృహ, వాహన రుణాలు, ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరే ఇతర పథకాలు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి వర్తించవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఎవరి పిల్లలు వాళ్లిష్టం కదా ఇదెక్కడి రూల్స్ అని విమర్శించేవారికి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్న నినాదాన్ని ప్రోత్సహించడానికి అస్సాం సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని పబ్లిక్ రిలేషన్ సెల్ సమర్థించుకుంటోంది.