కేసుల్లో మరాఠ నాయకులు
ముంబై, అక్టోబరు 23
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పాత్రధారులు దేవేంద్ర ఫడ్నవిస్, శరద్ పవార్. వీరిలో ఫడ్నవిస్ మాజీ ముఖ్యమంత్రి కాగా, పవార్ ఎన్సీపీ ( నేషనల్ కాంగ్రెస్ పార్ట్స్) అధినేత ఫడ్నవిస్ విదర్భ కేంద్రమైన నాగ్ పూర్ వెస్ట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు. ముంబయికి దూరంలో ఉండే విదర్భ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడుతోంది. పవార్ పదహారణాల మరాఠా. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదు. బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ శివసేన పొత్తుతో, పవార్ హస్తం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల గోదాను ఈదుతున్నారు. ఫడ్నవిస్ యువ నాయకుడు కాగా, శరద్ పవార్ అనేక యుద్ధాల్లో ఆరితేరిన కురువృద్ధుడు. సీఎంగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవజ్జుడు.ఎన్నికలకు ముందు కాకతాళీయంగా ఈ ఇద్దరు నాయకులు కేసులను ఎదుర్కొంటుండం విశేషం. పార్టీ అభ్యర్థుల గెలుపు పై దృష్టి సారించాల్సిన వీరు ఓ పక్క కేసుల తో సతమతమవుతున్నారు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ పై గల పాత కేసులను తిరిగి విచారించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో అధికార బీజేపీలో కలకలం చెలరేగింది. ఎన్నికల వేళ ఏమిటీ విపత్కర పరిస్థితి అని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. పెండింగులో ఉన్న రెండు క్రిమినల్ కేసుల వివరాలను 2014 ఎన్నికల ప్రమాణపత్రంలో వెల్లడించనందుకు ఫడ్నవిస్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల స్పష్టం చేసింది. అభియోగాలు నమోదైన కేసులతో పాటు న్యాయస్థానం పరిశీలనలో ఉన్న కేసుల వివరాలను కూడా అఫిడవిట్ లో తెలపాల్సిందేనని కోర్టు స్ఫష్టం చేసింది.ఈ కేసులను ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125ఏ కింద విచారించాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు చెల్లదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పించింది. అంతేకాక దిగువ న్యాయస్థానం కేసు విచారణను పున: ప్రారంభించాల్సిందిగా ఆదేశించింది. బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సతీష్ ఉన్ కే అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. మోసం ఫోర్జరీలకు సంబంధించి ఫడ్నవిస్ పై 1996, 1998 ల్లో కేసులు నమోదయ్యాయి. అవే ఇప్పుడు ఫడ్నవిస్ మెడకు చుట్టుకున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ కేసుల విచారణ వల్ల ఆయనకు వచ్చే ప్రమాదం ఏమిలేదు. అయితే మున్ముందు ఫడ్నవిస్ రాజకీయ భవితవ్యానికి ఇబ్బంది కరంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తానని ఫడ్నవిస్ పైకి చెబుతున్నప్పటికీ లోలోపల ఆందోళన చెందుతున్నారు. రేపటి ఎన్నికల్లో పార్టీ గెలిచినా ఈ కేసుల సాకు చూపి తన ప్రత్యర్థులు ముఖ్యమంత్రి పదవి దక్కకుండా చేస్తారన్ననది ఫడ్నవిస్ భయం. అయితే అదే సమయంలో ప్రధాని మోడీ, అధ్యక్షుడు అమిత్ షా అండదండలు ఉన్నందున తనకు ఇబ్బందీ ఏమి ఉండదన్నది ఫడ్నవిస్ ధీమా. ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.ఏడు పదుల వృద్ధాప్యంలో జీవిత చరమాకంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కేసులను ఎదుర్కొంటున్నారు. తన రాజకీయ జీవితంలో కేసులను ఎదుర్కోవడం ఆయనకు ఇదే తొలిసారి. ఎన్నికలకు ముందు ఆయన ఈడీ (ఎన్ రోల్ మెంట్ డైరెక్టరేట్) నుంచి కేసులను ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి పవార్, అతని మేనల్లుడు అజిత్ పవార్, మరో 70 మందిపై మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదుచేసింది. ఈ కేసు రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని పవార్ మద్దతుదారులు, పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పవార్ ప్రతిష్టను, పార్టీ ఇమేజీని దెబ్బతీసేందుకు కేంద్రం ఈ పని చేసిందని చెబుతున్నాయి. ఈ వాదనను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఖండిస్తున్నారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకే ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు. అంతే తప్ప అధికార పార్టీ కావాలని చేయలేదని స్పష్టం చేస్తున్నాయి. వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని, రాజీకీయ కోణంలో ఆలోచించరాదన్నారు. తనపై కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిగువ న్యాయస్థానంలో విచారణ జరుగుతుందని, ఈ విషయాన్ని గ్రహించాలని ఫడ్నవిస్ కోరారు. ప్రజా జీవితంలో కేసులు, విచారణలు తప్పవని,వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప రాజకీయ రంగు పులమరాదని స్పష్టం చేశారు. పవార్, ఆయన పార్టీ నాయకులు ఈ వాదదను అందజేస్తున్నారు.బ్యాంక్ కుంభకోణంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, కనీసం తాను అందులో సభ్యుడను కాదని, డైరెక్టరును కూడా కాదని పవార్ స్పష్టం చేశారు.పాకిస్థాన్ లో ప్రజలు సంతోషంగా ఉన్నారని తన వ్యాఖ్యలకు కేంద్రం ఆగ్రహించింది . ఈ చర్యకు పాల్పడిందని ఆయన గుర్తు చేశారు. స్వయంగా తాను విచారణకు హాజరై కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానన్నప్పటికీ ఈడీ అంగీకరించలేదని, ఇంతకంటే తన నిజాయితీకి రుజువులు ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. రాజకీయంగా తనను వేధించడమే కేంద్రం లక్ష్యమని ఆయన ఆరోపించారు. ఆయన మేనల్లుడు అజిత్ పవార్ కూడా ఇదే వాదనను వినిపిస్తున్నారు. కుంభకోణంలో పవార్ పాత్ర లేనేలేదని పేర్కొన్నారు. బ్యాంకులో 13వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉంటే 25వేల కోట్ల రూపాయల కుంభకోణం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద ఫడ్నవిస్, శరద్ పవార్ తాము నిర్దోషులమని చెబుతున్నప్పటికీ, ప్రస్తుతానికి రాజకీయంగా ఇబ్బందులను మాత్రం ఎదుర్కొంటున్నారు.