కేసీఆర్ కు బై ఎలక్షన్ సెంటిమెంట్
హైద్రాబాద్, అక్టోబరు 23
ఎన్నికలు…. ఆ వెంటనే ఉప ఎన్నికలు…. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఎన్నికల బంధమిది. 19ఏళ్ల టిఆర్ఎస్ ప్రస్థానంలో టీఆర్ఎస్ నాలుగు సార్లు శాసనసభ ఎన్నికల్లో, నాలుగుసార్లు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసింది. 6 సార్లు శాసనసభ ఉప ఎన్నికల్లో , ఒకసారి లోక్ సభ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ ఎదుర్కొంది. నిర్ణీత కాలవ్యవధిలో వచ్చే ఎన్నికలకు ఆకస్మికంగా సిద్ధంకావడం టిఆర్ఎస్ పార్టీకి ఆనవాయితీ.తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షను తెలిపేందుకు తరచూ కేసీఆర్ రాజీనామా అస్త్రాన్ని ఉపయోగించేవారు. తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధమయ్యేవారు. ఉద్యమ ప్రస్థానంలో పదవీ కాలం ముగియకముందే రాజీనామాలు చేయడంతో పాటు ఎన్నికల ద్వారా ప్రజల ఆకాంక్షను చాటేందుకు టిఆర్ఎస్ యత్నించింది. తెలంగాణ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేశాక కూడా తొమ్మిది నెలల గడువుకు ముందే శాసనసభను రద్దుచేసి ఆ పార్టీ ఎన్నికలకు వెళ్లింది.ఏ పార్టీ అయినా ఎన్నికలంటే కాస్త భయపడుతుంది. ఇక ఉప ఎన్నికలంటే మరింత భయం. కాని టిఆర్ఎస్ పార్టీకి ఉప ఎన్నికలు కలిసోచ్చాయి. ఉప ఎన్నికల్లో హేమా హేమీలను సైతం టిఆర్ఎస్ మట్టికరిపించింది. ఇలా ఇప్పటి వరకు కేసీఆర్ కు ఉప ఎన్నికలు, ముందస్తు ఎన్నికలూ కలిసొచ్చాయి. మరి ఇప్పుడు హుజూర్ నగర్ లో జరిగిన ఉప ఎన్నిక కలిసొస్తుందా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నికవడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలైతే ముగిశాయి. మరి ప్రస్తుత తరుణంలో కేసీఆర్ ఉప ఎన్నికల సెంటిమెంట్ పనిచేస్తుందా లేదా అనే విషయం తెలియాలంటే గురువారం వరకు వేచి చూడాల్సిందే.