సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న కాంగ్రెస్
ముంబై, అక్టోబరు 23
కాంగ్రెస్ ప్రతి ఎన్నికల్లోనూ వ్యహాత్మక తప్పిదం చేస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ అదే తీరు వ్యవహరించింది. మరాఠా ఓట్లను చేజేతులా కోల్పోయేలా కాంగ్రెస్ తనకు తానే గోతిలో పడిందంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ ప్రచారంలోనూ పూర్తిగా వెనకబడిపోయిందనే చెప్పాలి. రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా పెద్దగా ఫలితం కన్పించలేదు. పోలింగ్ పూర్తయిన తర్వాత లెక్కలు వేసుకుంటే భారతీయ జనతా పార్టీ కూటమికే ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్లు కన్పిస్తుంది.మహరాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ, శివసేన కూటమిగా, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిగా ఏర్పడి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది. దీనికితోడు రాహుల్ గాంధీ పార్టీ కాడిని వదిలేయడం కూడా ఆ ప్రభావం మహారాష్ట్ర ఎన్నికలపై పడిందంటున్నారు. కాంగ్రెస్ కు అసలు భవిష్యత్ నాయకుడు ఎవరన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. సోనియా గాంధీ ఆరోగ్యం సక్రమంగా లేకపోవడం, రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టకుండా భీష్మించుకు కూర్చోవడం వంటివి కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీశాయంటున్నారు.ఒకప్పుడు శరద్ పవార్ పార్టీ మహారాష్ట్రలో బలంగా ఉండేది. మరాఠా ప్రాంతాల్లో కొంత బలం పవార్ చూపేవారు. ఈ ఎన్నికల్లో శరద్ పవార్ పార్టీ 125 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 125 స్థానాల్లోనూ పోటీ చేస్తుంది. మిగిలిన 38 స్థానాలను చిన్నా చితకా పార్టీలైన మిత్రపక్షాలకు పంచారు. శరద్ పవార్ పార్టీ పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ఆయన కూడా వృద్ధాప్యంలో ఉండటం, వారసత్వం లేకపోవడంతో ఆ పార్టీపై క్యాడర్ లోనే నమ్మకం లేకుండా పోయింది. ఇటు కాంగ్రెస్ పుంజుకోలేక, అటు శరద పవార్ పార్టీ బలహీనంగా ఉండటంతోనే మహారాష్ట్ర పోలింగ్ సరళిని చూసిన వారెవరికైనా ఓటమి తప్పదన్న వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక మరాఠాలకు అత్యంత ఇష్టుడైన సావార్కర్ ను బీజేపీ ఎన్నికల ప్రచారాంశంలోకి తీసుకు వచ్చింది. సావర్కర్ కు భారత రత్న ఇస్తామని బీజేపీ నేతలు పదే పదే ప్రకటనలు చేయడం వెనక కూడా హిందుత్వ ఓటు బ్యాంకుతో పాటు మరాఠాల ఓట్లను పదిలపర్చుకునేందుకే. ఇది గమనించని కాంగ్రెస్ పార్టీ నేతలు సావర్కర్ కు మహాత్మాగాంధీ హత్యలో భాగస్వామి ఉందంటూ ఆరోపణలు చేయడంతో మరాఠాలు కాంగ్రెస్, ఎన్సీపీలకు దూరమయ్యారన్నది విశ్లేషకుల అంచనా. ఇలా బీజేపీ ట్రాప్ లో కాంగ్రెస్ నేతలు పడిపోయారంటున్నారు. మొత్తం మీద ఫలితాలు రాకముందే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి పేలవ ప్రదర్శన చూపిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.