దిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం పెద్ద షాకిచ్చింది. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. లాభదాయక పదవుల వ్యవహారంలో వీరిపై అనర్హత వేటు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 2015లో ఆప్ ప్రభుత్వం 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన విషయం తెలిసిందే. దిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది సభ్యులకు గాను ఆప్‌కు 67 మంది ఉన్నారు. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఆపద లేకపోయినప్పటికీ పార్టీకి మాత్రం పెద్ద ఎదురు దెబ్బేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు భాజపా వెల్లడించింది. దీన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ఆప్ ప్రకటించింది.