ప్రగతి భవన్ ముట్టడి : రేవంత్ రెడ్డిపై కేసు
హైద్రాబాద్, అక్టోబరు 23,
ప్రగతి భవన్ ముట్టడి సమయంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎస్సై నవీన్ రెడ్డి ఫిర్యాదు మేరకు.. ఐపీసీ సెక్షన్లు 341, 332, 353 కింద రేవంత్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కాంగ్రెస్ నాయకుల ఇళ్ల వద్దకు చేరుకొని వారిని హౌస్ అరెస్ట్ చేశారు.జూబ్లిహిల్స్ రోడ్ నంబర్ 48లో ఉన్న రేవంత్ నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. కానీ మధ్యాహ్నం సమయంలో రేవంత్.. తన అనుచరులతో కలిసి స్పీడ్‌గా బయటకొచ్చారు. తన కోసం బైక్ స్టార్ట్ చేసి వేచి చూస్తున్న వ్యక్తితో కలిసి ప్రగతి భవన్ వైపు వెళ్లారు. ఈ క్రమంలో.. ఎస్సై నవీన్ రెడ్డి, ఇతర పోలీసులు రేవంత్‌ను అడ్డుకోవడానికి, ఆపడానికి ప్రయత్నించారు.కానీ రేవంత్ రెడ్డి వారిని పక్కకు నెడుతూ ముందుకెళ్లారు. రేవంత్ పోలీసుల దగ్గర్నుంచి తప్పించుకొని వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. తన విధులకు ఆటంకం కలిగించారని, ఎంపీ తోసేయడంతో తాను గాయపడ్డానని ఆరోపిస్తూ.. రేవంత్ రెడ్డిపై ఎస్సై నవీన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రగతిభవన్ ముట్టడించేందుకు వెళ్లిన సమయంలో.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. క్యాంప్ ఆఫీస్ సెక్యూరిటీ ఇంచార్జిగా వ్యవహరించిన ఆసిఫ్ నగర్ ఏసీపీ నంద్యాల నరసింహరెడ్డిని డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు