శివకుమార్ కు బెయిల్
బెంగళూర్, అక్టోబరు 23,
మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరైంది. ఢిల్లీ హైకోర్టు రూ.25 లక్షల పూచీకత్తుతో శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో సెప్టెంబర్ 3న డీకే శివకుమార్ ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.మెడికల్ గ్రౌండ్స్ కింద కూడా శివకుమార్‌కు బెయిల్ ఇవ్వవచ్చు అని కోర్టు చెప్పింది. సీనియర్ కాంగ్రెస్ నేతకు బెయిల్ ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ జడ్జి జస్టిస్ సురేశ్ కుమార్ కైట్ ఆదేశించారు. మనీల్యాండరింగ్ కేసులో మళ్లీ అతన్ని అరెస్టు చేయాల్సి అవసరం కానీ, విచారించాల్సిన అవసరం కానీ లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేక సీబీఐ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో.. శివకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. మనీల్యాండరింగ్ ఆరోపణల కింద ఐటీ అధికారులు ఈడీ వద్ద కేసు నమోదు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు శివకుమార్‌తో పాటు అతని కుటుంబసభ్యులపై కేసు నమోదు అయ్యింది. అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. శివకుమార్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఈడీ తరపున ఏఎస్‌జీ కేఎం నటరాజ్ వాదించారు.