బీసీసీఐ ఛీఫ్ గా కోహ్లీ బాధ్యతలు
ముంబై, అక్టోబరు 23,
భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ ముఖ్యమైన వ్యక్తి అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ముంబైలో ఇవాళ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి అంశంలోనూ కోహ్లీకి సపోర్ట్ ఇస్తానన్నారు. కోహ్లీతో రేపు మాట్లాడుతానని, అతనికి అన్ని విధాలా మద్దతు ఇస్తామని గంగూలీ అన్నారు. భారత జట్టును కోహ్లీ ఓ కొత్త స్థాయికి తీసుకువెళ్లాడని, అతనికి అండగా ఉంటామన్నారు. బీసీసీఐ నిర్వహణలో ఎటువంటి లోపం ఉండదన్నారు. బీసీసీఐలో ఎటువంటి అవినీతి జరగకుండా చూస్తానని, అందరికీ బోర్డు ఒకేలా ఉంటుందని, తాను టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన తరహాలోనే.. బీసీసీఐని కూడా నడిపిస్తానని గంగూలీ అన్నారు. మీడియా సమావేశానికి టీమిండియా బ్లేజర్ వేసుకుని వచ్చిన గంగూలీ.. తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఆ బ్లేజర్ తనకు ఇచ్చారన్నారు. ఆ బ్లేజర్‌ను ఇవ్వాల ధరించాలని నిర్ణయించానని, కానీ ఇది చాలా లూజ్‌గా ఉందన్న విషయాన్ని గ్రహించలేకపోయినట్లు గంగూలీ చెప్పారు.
65 ఏళ్ల తర్వాత
65 ఏళ్ల తర్వాత ఓ మాజీ క్రికెటర్ .. బీసీసీఐ బోర్డు పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. ముంబైలో ఇవాళ జరిగిన సర్వసభ్య సమావేశంలో గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ప్యానల్ పదవీకాలం ముగిసింది. ఎలక్టోరల్ ఆఫీసర్ ఎన్. గోపాలస్వామి చేతుల మీదుగా గంగూలీ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సీఓఏ సభ్యులు, రాష్ట్ర సంఘాల ప్రతినిధులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. గంగూలీతో పాటు నలుగురు ఆఫీస్ బియరర్లు.. సీఓఏ నుంచి సంపూర్ణంగా బాధ్యతలు స్వీకరిస్తారు. గత 33 నెలల నుంచి సీఓఏనే .. బీసీసీఐ బోర్డును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వినోద్ రాయ్, డయానా ఎడుల్జీ, లెఫ్టినెంట్ రవి తోడ్జేలు .. ఇన్నాళ్లూ సీఓఏ సభ్యులుగా ఉన్నారు.
సంతృప్తికరంగానే బీసీసీఐని వీడుతున్నట్లు సీఓఏ సభ్యుడు వినోద్ రాయ్ తెలిపారు. బీసీసీఐ పగ్గాలు చేపట్టిన గంగూలీ.. ఉత్తమ కెప్టెన్ అని రాయ్ కొనియాడారు. బెంగాల్ క్రికెట్ సంఘానికి కూడా అయిదేళ్లు బాధ్యతలు నిర్వర్తించారన్నారు. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు గంగూలీ కన్నా బెటర్ ఎవరూ లేరని రాయ్ అన్నారు. రాజ్యాగం ప్రకారం బీసీసీఐలో ఎన్నికలు నిర్వహించడం తమ బాధ్యత అని, దానికి తగినట్టుగానే ఆ పని నిర్వర్తించామని రాయ్ తెలిపారు. ఓ మాజీ క్రికెటర్ బీసీసీఐ పగ్గాలు చేపట్టడం సంతోషంగా ఉందని సీఓఏలోని మరో సభ్యుడు ఎడుల్జీ అన్నారు. బీసీసీఐని గంగూలీ మరింత ఉన్నత స్థానాలకు చేరుస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పారు.