ఏడు హాస్టళ్ల కిచెన్లను సీజ్
హైదరాబాద్ అక్టోబర్ 23
కుళ్లిన కూరగాయలు, ఫ్రిజ్ లో అన్నం నిల్వ, లేని సిల్ట్ చాంబర్ల నిర్మాణం, ఏవిధమైన ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న హాస్టళ్లను చూసి జిహెచ్ఎంసి అధికారులు నివ్వెరపోయారు. ఎస్.ఆర్ నగర్ లో నేడు పలు హాస్టళ్లపై జిహెచ్ఎంసి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా దాదాపు అన్ని హాస్టళ్లలో కుళ్లిన కూరగాయలు, నిల్వచేసిన ఆహారపదార్థాలను గమనించారు. ఈ హాస్టళ్లలో సిల్ట్ చాంబర్లు నిర్మించకుండా వ్యర్థాలను నాలాల్లో వేయడంతో మురుగునీరు రోడ్లపై పారడం, ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఈ హాస్టళ్లను నిర్వహిచడం పట్ల జిహెచ్ఎంసి అధికారులు ఆయా హాస్టళ్లకు నోటీసులు జారీచేసి, హాస్టళ్ల కిచెన్(వంటగది)లను సీజ్చేశారు. ఖైరతాబాద్ మెడికల్ ఆఫీసర్ భార్గవ్ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో ఒక లేడీస్ హాస్టల్తో సహా మొత్తం ఏడు హాస్టళ్ల కిచెన్లను సీజ్ చేశారు.