కేరళలో అరేబియా సముద్రతీరాన వున్న ఒక చిన్న పల్లె పరయకడువు. అక్కడ వున్న వారంతా సముద్రంలో చేపలు పట్టి జీవనాన్ని సాగించే బెస్తవారే. సుగుణానందన్ అనే వ్యక్తి చేపల అమ్మకపు పని చేస్తూ వుండేవాడు.
తన కులస్థురాలైన దమయంతి అనే ఆమెతో వివాహమయింది. ఆ దమయంతి అతి పవిత్రంగా వుంటూ ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ వుండడం వలన ఆమెను అందరూ పట్టత్తి అమ్మ అంటే బ్రాహ్మణ స్త్రీ అని సంబోధించే వారు. వారిరువురికి మొత్తం 13 మంది సంతానం కల్గితే అయిదుగురు మరణించడంవలన చివరకు 8 మంది మిగిలారు. వారిలో 4 గురు ఆడ పిల్లలు. ఈ నలుగురాడ పిల్లల్లో సుధామణి అనేఆమె మాతా అమృతానందమయిగా ప్రసిద్ధిపొందింది.
సుధామణి కడుపులో వున్నప్పుడు దమయంతికి కలలో అనేకసార్లు శ్రీకృష్ణుడు, శివపార్వతులు కనబడుతూ వుండేవారు. తండ్రి అయిన సుగుణానందన్ కు కూడా దివ్యమాత కలలో సాక్షాత్కరించి దీవించింది. భార్యభర్తలిరువురూ ఈ విషయాన్ని తరచూ చర్చించుకొంటూ ఆ కలల ప్రాముఖ్యత ఏమిటో తెలియక ఆలోచనలో పడేవారు.
1953 సెప్టెంబర్ 27వ తేదీన సముద్ర కెరటాల హోరుతో మారు మోగుతున్న పల్లె ప్రాంతంలోని ఒక చిన్నతాటాకు గుడిసెలో సుధామణి జన్మించింది. ఆ పాప ముదురు నీల ఛాయలో బొటన వేలు, చూపుడు వేలు కొనలను రెండింటినీ ఒకదానికొకటి వలయాకారంగా చేర్చిన చిన్ముద్రతో పద్మాసనం వేసుకొని పడుకొని ఉండటం చూసి తల్లిదండ్రులు తబ్బిబ్బయ్యారు. ఈ పాప పుట్టినప్పటి నుంచి అసాధారణమైన సంకేతాలను కొన్నిటిని కుటుంబం గమనిస్తూ వచ్చింది. పాపకు 6 నెలలు వచ్చిన వెంటనే అకస్మాత్తుగా లేచి నిలబడి వరండాలో నడవడం మొదలు పెట్టింది. అందరూ ఆశ్చర్యపోయారు.
ఆమెకు సుధామణి (అద్భుతమైన రత్నం) అని పేరు పెట్టారు. ప్రతీవారు ఆమెను ఎత్తుకొని కుంజు (చిట్టి) అని పిలిచేవారు. అయిదేళ్ళు వచ్చేసరికి కృష్ణుని పై పాటలు పాడడం, తను తొడుక్కున్న చొక్కా జేబులో ఒక చిన్న కృష్ణుని పటం పెట్టుకొని తరచూ తీసిచూసుకొంటూ నాట్యం చేసేది. ఏకాంతంగా ఒక చోట కదలకుండా కూర్చొని ధ్యానం చేయడంలో నిమగ్నమయ్యేది. కంటి నుంచి ఎడ తెరిపి లేకుండా నీరు కారుస్తూ వుండేది. ఆమె ఈ స్థితిని చూచి చాలామంది ఆశ్చర్యపోతే, మరికొందరు ఈ పిల్లకు ఏదో ఒక వ్యాధిగ్రస్తురాలు అని వాదించడం మొదలు పెట్టారు. స్కూలుకి వెళ్ళి నాల్గవ తరగతి వరకు చదివింది. ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఇంటికి వెనకవున్న గొడ్ల చావడిలో ఏకాంతంగా ధ్యానం చేస్తూ వుండేది. ఆమె ఏ పనిచేస్తున్నా కృష్ణుని పై భక్తిగీతాలు పాడుతూనే వుండేది. ఈమె ప్రవర్తనను కుటుంబ సభ్యులు కూడా సరిగ్గా అర్ధం చేసుకోకుండా ఆమెను చితకబాదేవారు. కాని ఒక్క మాట కూడా బదులు చెప్పకుండా అటువంటి హింసాత్మక చర్యలను సహిస్తూ ఆధ్యాత్మిక పథంలో పయనిస్తూ పరిపూర్ణతను సాధించింది.
రాత్రి 11 గం.లకు ఇంటి పని పిల్ల అన్ని పనులు చేసుకొని తన సాధనలో మునిగిపోయేది. ప్రతి ఒక్క శ్వాసలో కృష్ణ నామాన్ని నింపుకునేది. ఆమె 14వ ఏట “నేను నీ యింట్లో అడుగు పెట్టను. మీరే వచ్చి నన్ను బ్రతిమాలుకొని రమ్మని పిలిచే వరకూ నేను రాను” అని ఇల్లు వదలి మరో యింటికి వెళ్ళిపోయింది. తరువాత 11 ఏళ్ళు గడిచాయి. సుధామణి బంధువులు కష్టాల పాలయ్యి ఆమె వద్దకు వచ్చి సహాయం చెయ్యమని బ్రతిమాలుకున్నారు. ఆమె వెళ్ళి పూజచేసి దీవించింది. వాళ్ళ పరిస్థితి కుదుటపడింది. తరువాత కుట్టుపని నేర్చుకొని క్రైస్తవ చర్చిలో ప్రార్థన చేస్తూ వచ్చింది. ఇంటి ఇంటికి చేరి పాలు అమ్మేది. తరచూ స్పృహ లేకుండా పడిపోయేది. ఆమెకు తరచు దివ్య దర్శనాలు కలుగుతూ వుండేవి. ఆమెకు కృష్ణుడు స్వయంగా దర్శనమిచ్చాడు. సం. 1975 సెప్టెంబరు నెలలో పశువులకై తల పై గడ్డిమోపు పెట్టుకొని వస్తూవుంటే గ్రామంలో ఒకచోట నుంచి భాగవత కీర్తన వినవచ్చింది. ఇంటికి వెళ్ళకుండా ఆ ప్రదేశానికి వెళ్ళి తాదాత్మ్యంతో కృష్ణునిలాగా నాట్యం చేసింది. సాక్షాత్తు కృష్ణుడే కరుణించి వచ్చాడని అక్కడ భాగవతం వింటున్నవారు భావించి ఆమెను కొలవడం ప్రారంభించారు.
కొందరు హేతువాదులు అక్కడకు చేరి సుధామణికి చాలా ఇబ్బందులు కలుగజేసేవారు. వారికి సరియైన బుద్ధి చెప్పడానికి ఏదైనా మహిమను చేసి చూపించ మని భక్తులు ఆమెను కోరారు. “మీలో విశ్వాసం కల్గించడానికి ఒకే ఒక్కసారి చేస్తాను. మరెన్నడు అటువంటి కోరికను కోరవద్దు. కాని ఏడాది తరువాత జరిగే భాగవత కాలక్షేపం చూపిస్తాను” అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి సంవత్సరం (1976) రానే వచ్చింది.
భాగవత సప్తాహం మొదలయ్యింది. హేతువాద సంఘాల సభ్యులు ఆమెను చుట్టుముట్టి ఏమి చేయబోతోందోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. ఆమెను సంశయిస్తున్న ఒక వ్యక్తిని కుండలో నీరు తెమ్మంది.. కుండను చేతిలోనికి తీసుకొని దానిలోని నీటినంతటినీ పవిత్రజలంగా చుట్టుచేరిన వారిపై చల్లింది. ఆ కుండలో చేయి పెట్టి తీసింది. ఆ నీళ్లు పాలుగా మారిపోయాయి. అందరికీ తీర్థంగా పంచింది. తరువాత మరొక వ్యక్తిని పిలిచి కుండలో చేయి పెట్టమంది. అతను అలా చేసి చూస్తే పాలు పంచామృతంగా మారిపోయాయి. అందులో అరటి పండ్లు, ద్రాక్ష, పటికబెల్లం ముక్కలు కూడా వుండడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆ పంచామృతం ఎంతమందికిచ్చినా తరగలేదు. ఈ సంఘటన గ్రామస్తుల విశ్వాసాన్ని పెంచింది.
ఆమెకు తరచు కృష్ణుడు పూనినట్లు నృత్యం చేసేది. అటువంటి సమయంలో ఒకతను గుళ్ళో పెట్టిన నూనె దీపాన్ని కావాలని పగులగొట్టాడు. సుధామణి కొంతమందిని వెంటనే ఆలి చిప్పలు తెమ్మంది. వాటిలో వత్తివేసి నూనె లేకుండా వెలిగించమంది. ఆమె సూచనను పాటించిన భక్తులు ఆశ్చర్యపోయారు. నూనె లేకుండా ఆ దీపాలు రాత్రంతా వెలిగాయి. ఇటువంటి లీల శిరిడీ సాయి చేసి చూపించారు. కొన్ని సంవత్సరాలకి సుధామణి దేవి సాధనకు పరమేశ్వరుణ్ణి, జగన్మాతను సాక్షాత్కరించుకోవాలనే ప్రగాఢమైన కోరికగల్గి తీవ్రంగా ధ్యానం చేయడం మొదలు పెట్టింది. ఆమెకున్న ఒకే ఒక కోరిక అమ్మను (జగన్మాతను) కౌగలించుకోవడం, అమ్మ ఒళ్ళో కూర్చోవడం, | అమ్మ బుగ్గమీద ముద్దు పెట్టుకోవడం, ఆమె తరచు దైవోన్మత్తురాలై ఏడవడం, నవ్వడం, క్రిందపడి దొర్లడం వంటివి చేసేది. సుధామణికి మంచెం, మేజా బల్ల, కుర్చీలు చేయించి ఒక వడ్రంగి భక్తుడిచ్చాడు.
తనకు కలలో కృష్ణుడు కన్పించి చిట్టితల్లికిమ్మని చెప్పాడని సమాధానం చెప్పాడు. ఆమెకు కృష్ణునితో బాటు జగన్మాత సాక్షాత్కారం లభించింది. ఆమె నాటి నుంచి అమృతానందమయిగా ప్రసిద్ధి చెందింది. ఈమె కూడా అవధూత కోవకు చెందినదే. అమృతానందమయి చూపిస్తున్న దివ్యలీలలు కోకొల్లలు. ఆమె మిషన్ ట్రస్టు, కొళ్ళం (కేరళ) అనేక సామాజిక, సాంఘిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. అనేక విద్యా సంస్థలను స్థాపించి మెరుగైన విద్యాబోధనను అందిస్తోంది. యావత్ ప్రపంచంలో అనేకమంది భక్తులు అమ్మను కొలుస్తున్నారు.
రామకృష్ణ పరమహంస కాళీదేవిని దర్శించుకొంటూ సమాధిస్థితిలోకి తరచు వెళ్ళేవారని కొంత సమయం తరువాత సామాన్య స్థితికి వచ్చేవారని ఆయనను సేవించిన భక్తులు తమ పుస్తకాల్లో ఉదహరించారు. పరమహంస తరువాత అటువంటి అనుభూతిని అనుభవించిన దివ్యమాతయే అమృతానందమయి. మన ఆంధ్ర దేశంలో గృహస్థురాలిగా వుంటూ అనేక అద్భుతాలు చూపించారు శ్రీమతి జిల్లెళ్లమూడి అమ్మ. ఆమె అనేక మందికి అన్నసంతర్పణ చేసిన అన్నపూర్ణ.
మూలాలు : నిష్ఠేశ్వర్