YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఆసరా వెనక ఆందోళన (కృష్ణా)

ఆసరా వెనక ఆందోళన (కృష్ణా)

ఆసరా వెనక ఆందోళన (కృష్ణా)
మచిలీపట్నం, అక్టోబర్ 23 :  గంగపుత్రులకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఏటా వేట నిషేధ కాలంలో పరిహారం అందిస్తున్నాయి. ప్రస్తుతం ఇచ్చే పరిహారాన్ని రూ.10వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్ల్లావ్యాప్తంగా బందరు, నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను తదితర ప్రాంతాల్లో మత్స్యకార కుటుంబాలకు చేపల వేటే ఆధారం. తమకు అందుబాటులో ఉన్న పడవల ద్వారా వాటి సామర్థ్యాన్ని బట్టి బందరుతోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్లి వేట చేస్తూ దొరికిన మత్స్య సంపదను విక్రయించి ఆదాయం పొందుతారు. ఏటా ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో రెండు నెలల పాటు వేట నిషేధిస్తుంది. ఆ సమయంలో సముద్రంలోకి వెళ్లేందుకు వీలుండదు. ఆ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు పరిహారం అందిస్తున్నారు. గతంలో 31 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందించేవారు. గత ప్రభుత్వం బియ్యం స్థానంలో ఒక్కొక్కరికి రూ.2వేలు, తరువాత రూ.4వేల చొప్పున నగదు సాయం అందించింది. ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇకపై రూ.10వేల చొప్పున అందనుంది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించారు. తీర ప్రాంత గ్రామాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే నిర్వహించిన అధికారులు మొత్తం జిల్లాలో 8,980 మందిని అర్హులుగా గుర్తించారు. వీరందరికీ త్వరలోనే ప్రభుత్వం ప్రకటించిన లబ్ధి వారి ఖాతాల్లో జమవుతుందని అధికారులు తెలిపారు. గ్రామాల వారీగా గుర్తించిన లబ్ధిదారుల జాబితాను అభివృద్ధి అధికారుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రదర్శించేలా చర్యలు తీసుకున్నారు. పరిహారంతోపాటు డీజిల్‌ రాయితీని కూడా పెంపుదల చేశారు. ఈ రాయితీ ఇప్పటివరకు లీటరుకు రూ.6 ఇస్తుండగా, ప్రస్తుతం దాన్ని రూ.9కి పెంచారు. రాయితీలు అర్హులకు అందించే విధానంలో కూడా పలు మార్పులు చేశారు.
జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో వందలాది మెకనైజ్డ్‌, మోటరైజ్డ్‌ బోట్లు ఉన్నాయి. ఆయా బోట్లకు వినియోగించే డీజిల్‌కు రాయితీ ఎప్పటినుంచో అందిస్తున్నారు. ప్రస్తుతం దాన్ని పెంచడంతోపాటు రాయితీ నిధులు మత్స్యకారులకే అందించేలా చర్యలు తీసుకుంది. గతంలో ఈ రాయితీ పొందడానికి అర్హులైనవారు పెట్రోల్‌ బంకుల నుంచి బిల్లులు తీసుకుని వాటిని మత్స్యశాఖ కార్యాలయంలో అందించాలి. అధికారులు వాటిని పరిశీలించిన తరువాత ఆమోదం తెలిపి ఖజానాశాఖ కార్యాలయానికి పంపేవారు. అక్కడ నుంచి నిధులు లబ్ధిదారులకు అందజేసేవారు. ఈక్రమంలో రాయితీ వసూలు చేసుకోవడం కోసం పడవల యజమానులు అనేక ఇబ్బందులు పడేవారు. సకాలంలో బిల్లులు సంతకాలు కాక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. నెలల తరబడి పెండింగ్‌లో ఉండటంతో తిరిగి డీజిల్‌ పెట్టుబడి సమయానికి డబ్బులు లేక బయట అప్పులు చేసేవాళ్లమని పలువురు తెలిపారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా రాయితీ నేరుగా మత్స్యకారులకే అందించేలా చర్యలు తీసుకున్నారు. దీనికోసం పడవల యజమానులకు మత్స్యశాఖ ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు అందజేస్తుంది. ఆ కార్డు తీసుకుని మత్స్యశాఖ గుర్తించిన బంకులకు వెళ్తే ప్రస్తుతం ఉన్న లీటరు డీజిల్‌ ధరలో ప్రభుత్వం రాయితీగా అందిస్తున్న రూ.9 తగ్గించి తీసుకుంటారు.

Related Posts