విద్య ఉన్నతం.. వసతి అధ్వానం (విశాఖ)
విశాఖపట్నం, అక్టోబర్ 23 (న్యూస్ పల్స్): జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆంద్ర వైద్య కళాశాలలో వసతి సదుపాయాలు పెరగడం లేదు. 30 యూజీ సీట్లతో మొదలైన ప్రస్థానం 250 వైద్య సీట్లకు చేరింది. 17 పీజీ సీట్లతో మొదలైన శకం ప్రస్తుతం 213 సీట్లకు ఎగబాకింది. ప్రస్తుతం వైద్యకళాశాలలో 1250 మంది మెడికోలు (అండర్ గ్రాడ్యుయేట్స్), 636 మంది జూనియర్ వైద్యులు (పోస్టుగ్రాడ్యుయేట్స్) చదువుతున్నారు. వీరికి తగ్గట్టుగా వసతి గృహాలు లేకపోవడంతో నానా అవస్థలు పడాల్సి వస్తోంది. పురాతన కళాశాల కావడం, బోధన మూలాలు బలంగా ఉండడం, అత్యధిక విభాగాలు అందుబాటులో ఉండడంతో నీట్, ఎంసెట్ వంటి వాటిలో తొలి 1000 ర్యాంకర్లలో అత్యధికులు ఇక్కడే చేరుతున్నారు. వీరిలో 60 శాతం మంది అమ్మాయిలే కావడం గమనార్హం. ఎంతో ఆశతో వస్తోన్న విద్యార్థులకు ఇక్కడ వసతి లేకపోవడంతో ప్రైవేటు గృహాలపై ఆధారపడాల్సి వస్తోంది. వసతి గృహాల్లో తక్కువ గదులు అందుబాటులో ఉండడంతో మూడో వంతు మంది రూ. వేలకు వేలు ఖర్చుచేసి అపార్ట్‌మెంట్లు, ఇళ్లను అద్దెకు తీసుకొని నెట్టుకొస్తున్నారు. ఇద్దరేసి ముగ్గురేసి విద్యార్థులు కలిపి ఇళ్లను అద్దెకు తీసుకుంటూ వైద్య విద్యను కొనసాగిస్తున్నారు. ఆంధ్ర వైద్యకళాశాలలోని వసతిగృహాల నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి ఏఎంసీ వర్గాలు ప్రభుత్వానికి పంపాయి. మొత్తం రూ. 227.93 కోట్ల ఖర్చుతో తయారుచేసిన ప్రతిపాదనల్లో హాస్టళ్ల కోసం రూ. 93.25 కోట్లు అవసరమని అంచనావేశాయి. యూజీ (మహిళల) హాస్టల్ 500 గదులతో నిర్మించేందుకు రూ. 22.75 కోట్లు, 600 గదులతో పీజీ వసతిగృహం నిర్మాణానికి రూ. 38.20 కోట్లు, 250 గదులతో హౌస్‌సర్జన్ల వసతికి రూ. 16.15 కోట్లు, 250 గదులతో సీనియర్ రెసిడెంట్స్ వసతి గృహానికి రూ. 16.15 కోట్లు అవసరమని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై ఇంతవరకూ ఉలుకూపలుకూ లేదు