YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ఆస్పత్రికి సుస్తీ (మెదక్)

ఆస్పత్రికి సుస్తీ (మెదక్)

ఆస్పత్రికి సుస్తీ (మెదక్)
మెదక్, అక్టోబర్ 23 : జిల్లాలో రెండో అతిపెద్దదైన నర్సాపూర్‌ ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల సేవలు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అనే చందంగా మారాయి. రూ.7 కోట్ల నిధులతో విశాల భవనాలు, రూ.4 కోట్లతో అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెచ్చినా ఆశించిన ఫలితం లేకుండా పోతోంది. నిధుల కొరత కారణంగా ఆస్పత్రి నిర్వహణ కష్టంగా మారింది. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉండడం లేదు. నర్సాపూర్‌ ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి స్థాయిని 30 పడకల నుంచి వంద పడకలకు పెంచాలని ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతూ వచ్చారు. ఈక్రమంలో రెండేళ్ల క్రితం వంద పడకలకు పెంచారు. 2017 సెప్టెంబరు 4న అప్పటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభ సమయంలో వీలైనంత త్వరగా వందపడకలకు సరిపడా వైద్యులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. రెండేళ్లు గడిచినా అతీగతీ లేదు. నిత్యం ఈ ఆస్పత్రికి 700 మంది వరకూ రోగులు వస్తున్నారు. సంతరోజు శుక్రవారం రోగుల సంఖ్య మరీ అధికంగా ఉంటుంది.
వంద పడకలకు విస్తరించిన ఈ ఆస్పత్రికి నేటికీ 30 పడకల ఆస్పత్రి నాటి బడ్జెట్‌ మాత్రమే కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి నిర్వహణకు ఏడాదికి రూ.2.50 లక్షలు ఇస్తున్నారు. ఆస్పత్రి స్థాయిని పెంచడంతో ప్రస్తుతం బడ్జెట్‌ కింద రూ.5 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అలా వచ్చే నిధులను  ఆస్పత్రిలో అత్యవసర పనులకు వినియోగిస్తారు. చిన్నపాటి మరమ్మతులు చేయిస్తారు. పరికరాలకు మరమ్మతులు అవసరమైతే చేయిస్తారు. మందులకు మూడు నెలలకోసారి రూ.4.95 లక్షలు, శస్త్రచికిత్సల నిమిత్తం రూ.2.24 లక్షలు కేటాయిస్తున్నారు. ఇవి కూడా 30 పడకల ఆస్పత్రిగా కొనసాగినప్పటి బడ్జెట్టే. అవి కూడా పెరగలేదు. ప్రస్తుతం విషజ్వరాలు, ఇతర అంటువ్యాధులతో నిత్యం వందల మంది రోగులు అస్పత్రికి వైద్యం కోసం వస్తున్నారు. వీరికి అవసరమైన మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారిని బయట తెచ్చుకోవాలంటూ వైద్యులు చీటీలు రాస్తున్నారు. జనరల్‌ సర్జన్లు, మత్తు, దంత, చెవి ముక్కు గొంతు, చిన్నపిల్లలు, ఎముకల వైద్యులు రాస్తున్న మందులు కొన్ని ఆస్పత్రిలో లభించడం లేదు. అలాగే వివిధ రకాల పరీక్షలకు రోగులను బయటకు పంపుతున్నారు. ఏమైనా అంటే ల్యాబ్‌లో వసతులు, రసాయనాలు అందుబాటులో లేవని చెబుతున్నారు.  ఇక్కడ ఐసీయూ విభాగం ఉన్నా అందుకు ప్రత్యేకంగా మత్తువైద్యులు, ఎమర్జెన్సీ మెడిసిన్‌, కార్డియాలజిస్టులు లేక వినియోగించడం లేదు. అధునాతన ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఐసీయూను మూసే ఉంచుతుండటం గమనార్హం. తొమ్మిది పడకలు ఉన్నా ఉపయోగంలో లేక దుమ్ము పట్టి పోతున్నాయి.

Related Posts