నవంబర్ నో హాలీడేస్
హైద్రాబాద్,
నవంబర్లో ఆదివారం సెలవులు రద్దు చేస్తూ మైనారిటీ గురుకుల ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్ణయం తీసుకుంది. ఆదివారాలూ స్కూళ్లు, కాలేజీలు నడుస్తాయని ఆ సంస్థ సెక్రటరీ ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆర్డర్స్ను అధికారికంగా ఈ నెల 18నే ఇచ్చినా మంగళవారం బయటకొచ్చాయి. రాష్ట్రంలో మొత్తం 204 మైనారిటీ గురుకుల స్కూళ్లున్నాయి. వాటిలో1,30,560 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. 7069 మంది సిబ్బంది పని చేస్తున్నారు.దసరా సెలవుల తర్వాత ఈనెల14 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం సెలవులను 20 వరకు పొడిగించింది. సమ్మె వల్ల పొడిగించిన సెలవులను కవర్ చేయడంలో భాగంగా ఇప్పటికే సర్కారు రెండో శనివారం సెలవులను రద్దు చేసింది. ఇప్పుడు సిలబస్ పూర్తి చేయాలన్న కారణంతో నవంబర్లో ఆదివారం సెలవులను మైనారిటీ గురుకుల సొసైటీ రద్దు చేసింది. అయితే జనరల్స్కూళ్లతో పోలిస్తే గురుకులాల్లో పనిభారం ఎక్కువగా ఉందని, వారానికో రోజు నైట్ డ్యూటీ చేయాల్సి రావడం, బోధనేతర పనులతో అవస్థలు పడుతున్నామని టీచర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆదివారం సెలవులను రద్దు చేయడంపై వాళ్లు మండిపడుతున్నారు. ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పని ఒత్తిడితో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్ (టీఎస్డబ్ల్యూఆర్ఎస్) టీచర్ (పీజీటీ) ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.