చేతికొచ్చే సమయంలో వానలతో నీటి పాలు
నిజామాబాద్,
రాష్ట్ర రైతులకు వర్షం భయం పట్టుకుంది. పంటలు చేతికొచ్చే సమయంలో వానలు పడితే చేసిన కష్టమంతా నీటిపాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో బిక్కుబిక్కుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 1.15 కోట్ల ఎకరాలలో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 33.68 లక్షల ఎకరాల్లో సాగైంది. మొక్కజొన్న 10 లక్షల ఎకరాల్లో, పెసర 1.78 లక్షల ఎకరాలు, సోయాబీన్ 4.16 లక్షల ఎకరాలు, పత్తి 49.15 లక్షల ఎకరాలు, కందులు 7.06 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అర్థ గణాంక శాఖ అంచనాల ప్రకారం వరి ఉత్పత్తి 66.62 లక్షల మెట్రిక్ టన్నులు, మొక్కజొన్న 13.79 లక్షల మెట్రిక్ టన్నులు, కందులు 1.94 లక్షల మెట్రిక్ టన్నులు, పెసర 45 వేల మెట్రిక్ టన్నులు, వేరుశనగ 30 వేల మెట్రిక్ టన్నులు, సోయాబీన్ 2.82 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. మార్క్‌ఫెడ్ ద్వారా సోయాబీన్, పెసర ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే సోయాబీన్ 113 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. పెసర 4769 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఇప్పుడు వర్షాలు కురిస్తే ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు రైతుకు మద్ధతు ధర కూడా లభించదు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చిన మొక్కజొన్న, సోయాబీన్, ధాన్యం వంటి పంట ఉత్పత్తులు ఆరుబయటే ఎటువంటి రక్షణ లేకుండా ఉంటాయి. వర్షాలు పడితే తడిసిపోయే ప్రమాదం ఉంది. కనుక మార్కెట్ యార్డులలో తూనిక కోసం ఎదురుచూస్తున్న పంట ఉత్పత్తులను తక్షణమే సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం లేదా వర్షానికి తడవకుండా వాటిపై ప్లాస్టిక్ టార్పాలిన్లు కప్పి ఉంచడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.ఇప్పటికే కొన్ని పంట ఉత్పత్తులు మార్కెట్‌కు వస్తున్నాయి. మొక్కజొన్న, పెసర, సోయాబీన్ వంటి పంట ఉత్పత్తులు మార్కెట్‌లోకి రైతులు తీసుకువస్తున్నారు. మరో వారం రోజుల్లో ధాన్యం కూడా మార్కెట్‌కు రానుంది. వరి పంట ఈదురుగాలులకు నేలకొరగడంతో పాటు వర్షపు నీటిలో మునుగుతున్నాయి. మంచిర్యాల్ జిల్లాలో ఆదివారం కురిసిన వానలకు ప్రధాన పంటలు దెబ్బతిన్నాయి. నిజామాబాద్ మార్కెట్ యార్డులోకి గత రెండు రోజులుగా తడిసిన పచ్చి సోయాబీన్‌నే తీసుకువస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు.తడిచిన సోయాకు క్వింటాకు రూ. 2 వేల నుంచి రూ.2500 వరకే వ్యాపారులు చెల్లిస్తున్నారు. అదే సమయంలో పత్తి పంటకు కూడా ఈ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో పత్తి మొదటి తీత కొనసాగుతోంది. అయితే వరుస వర్షాలతో వచ్చిన మొక్కమీదే పత్తి తడవడంతో పాటు, కాయలు కూడా నల్లబారిపోయి బూజు పడుతున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నైరుతి రుతు పవనాలు నెల రోజులు ఆలస్యంగా రావడం, ఆలస్యంగానే వెనుతిరగడం, ఈశాన్య రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతుండటంతో వానలకు అనుగుణంగా రైతులు చర్యలు తీసుకోకపోతే ఖరీఫ్ పంట ఉత్పత్తులకు నష్టం తప్పదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు హెచ్చరించాయి.