పట్టుబిగిస్తున్న పళని స్వామి
చెన్పై,
తమిళనాడులో 2021లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పళనిస్వామి ముఖ్యమంత్రిగా నిలదొక్కుకోవడమే. 2016లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మరణించిన వెంటనే నాటకీయ పరిణామాల మధ్య పళనిస్వామి ముఖ్యమంత్రి కాగలిగారు. అన్నాడీఎంకేకు జయలలిత అప్రతిహత మెజారిటీ తెచ్చిపెట్టడంతో బలంగా ఉంది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళుతూ పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయగలిగారు.అయితే పళనిస్వామి ఎన్నాళ్లో ముఖ్యమంత్రి పదవిలో ఉండలేరని అనేక మంది ఊహించారు. అప్పటికి పన్నీర్ సెల్వం కూడా తిరుగుబాటు నాయకుడిగా ఉన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చీలిపోయి ఉన్నారు. బలనిరూపణ చేసుకునేందుకు కూడా టెన్షన్ పడాల్సిన సందర్భం. అలాంటి సమయంలో రెండు సార్లు బలాన్ని పళనిస్వామి నిరూపించుకోగలిగారు. తనను బలపరీక్షలో వ్యతిరేకించిన పన్నీర్ సెల్వంను తన దారికి తెచ్చుకోగలిగారు. ఉపముఖ్యమంత్రిని చేయగలిగారు.ఇక పార్టీలో తనకు ఏకు మేకవుతారని, తనను గద్దెనుంచి దింపే అవకాశమున్న ఒకే ఒక నేత దినకరన్ ను పార్టీ నుంచి విజయవంతంగా పంపగలిగారు. ఎంతగా అంటే దినకరన్ కు మద్దతిచ్చిన దాదాపు 26 మంది ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయించారు. అంటే అంతమంది ఎమ్మెల్యేలు ఎదురుతిరిగినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా అనర్హత వేటు వేయడంతో మిగిలిన ఎమ్మెల్యేలను సైలెంట్ చేయగలిగారు.మరోవైపు ఎమ్మెల్యేలను సంతృప్తి పర్చడానికి నియోజకవర్గ నిధులను పెంచారు. ఎప్పటికప్పుడు వారి అవసరాలను తీరుస్తూ వారిని మచ్చిక చేసుకున్నారు. దాదాపు మూడేళ్ల నుంచి పళనిస్వామి తనకు ఎదురులేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగగలిగారు. జయలలిత, కరుణానిధి నేతల ఇమేజ్ లేకపోయినా తనదైన వ్యూహంతో పళనిస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలు పెంచుకుని తన పదవిని పదిలం చేసుకున్న పళనిస్వామి వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలపిిస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే తమిళనాడు లాంటి రాష్టానికి ముఖ్యమంత్రిగా ఇంతకాలం కొనసాగడం రికార్డు బ్రేక్ అని చెప్పక తప్పదు.