అంతు పట్టని జగ్గారెడ్డి వ్యూహాలు
మెదక్,
జగ్గారెడ్డి.. సంగారెడ్డి ఎమ్మెల్యే.. ఇయన రూటే సెపరేటు. కాంగ్రెస్ మాస్ లీడర్‌గా పేరొందిన ఈయన.. ఇటీవల వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఎప్పుడు ఏం చేస్తారో.. ఏం అంటారో తెలియకుండా పోయింది. రోజుకో స్టైల్లో ఆయన రాజకీయం కొనసాగుతోంది. అప్పుడే అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. మళ్లీ మరుసటి రోజే.. రివర్స్ గేర్ వేసి.. పొగడతారు. బద్ధశత్రువుగా ఉన్న అధికార పార్టీ నేతపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆయనతోనే మళ్లీ మీట్ అవ్వడం.. ఇది ప్రస్తుతం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీరు. అసలు ఆయన రూటేంటి. ప్రతిపక్షంలో ఉండి ఇన్ని రకాలుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు. పార్టీ అధికారంలో లేదని అలా వ్యవహరిస్తున్నారా? లేక పార్టీ జంపింగ్ ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? మొత్తానికి జగ్గారెడ్డి తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.సంగారెడ్డిలో బలమైన నేత జగ్గారెడ్డి. అంతేకాదు.. కాంగ్రెస్‌లో మాస్ లీడర్ కూడా ఇయనే. కానీ ఇప్పుడు ఆయన వ్యవహారమే గాంధీభవన్ నుంచి సంగారెడ్డి వరకు చర్చ జరుగుతోంది. అందుకు కారణం లేకపోలేదు. ఒకప్పుడు సీఎం కేసీఆర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యేవారు. ఆ తర్వాత రెండో సారి టీఆర్ఎస్ అధికారం చేపట్టాక.. జగ్గారెడ్డి దూకుడులో మార్పులు వచ్చాయి. ఒకరోజు సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేస్తారు. వెంటనే మరోరోజు కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఒకసారి హరీష్ రావు పైనా ఫైర్ అవుతారు. మళ్లీ టైమ్ దొరకగానే ఆయనకు సన్మానం చేస్తారు.తాజాగా సేమ్ ఇలాంటి సీన్ మళ్లీ రిపీట్ చేశారు. 20రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సంగారెడ్డిలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొని.. కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఆ తర్వాత అరెస్టు కూడా అయ్యారు. కార్మికుల పట్ల మొండివైఖరి విడనాడాలంటూ ప్రభుత్వానికి సూచనలు కూడా చేశారు. అంతేకాదు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో కూడా పాల్గొని.. ఏకంగా ప్రగతి భవన్ వద్దకు ఆటోలో చేరుకుని అరెస్ట్ అయ్యారు. ఇదంతా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోషించిన పాత్రగా అనుకోవచ్చు.అయితే ఇంతలోనే మళ్లీ తన ట్యూన్ ఛేంజ్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం అయ్యి.. 24 గంటలు గడిచిందో లేదో మళ్లీ కేసీఆర్‌ని పొగడ్తలతో ముంచెత్తే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. దీంతో ఏకంగా కేసీఆర్ ఫోటో పక్కన తన ఫోటో వేసుకొని సంగారెడ్డిలో కరపత్రాలు పంపిణీ చేశారు.అసలు జగ్గారెడ్డి స్టాండ్ ఏంటో అర్ధం కాక ప్రజలు తలలు పట్టుకుంటున్నారట. ఒకవైపు పోరాటం.. కార్మికులకు సంఘీభావం.. మరోవైపు కేసీఆర్‌ని పొగడ్తల్లో ముంచెత్తడం.. అసలు జగ్గారెడ్డి ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఈ విషయం సంగారెడ్డిలో చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఇంతకీ ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతారా లేదా కారెక్కి.. టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారా..? అన్నది ఎవరికీ అంతుపట్టడంలేదు. మొత్తానికి జగ్గారెడ్డి రోజుకో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను.. పబ్లిక్‌కు చూపిస్తున్నారని సెటైర్లు విసురుతున్నారు