YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

భవసాగరం

భవసాగరం

భవసాగరం
సంసారం, సన్యాసం అనేవి భిన్నధ్రువాలు. అన్నీ కావాలనుకునేది సంసారం అయితే ఏదీ వద్దనుకునేది సన్న్యాసం. లోకంలో ఈ భిన్నధ్రువాలకు భిన్నంగా ప్రవృత్తులు దర్శనమిస్తున్నాయి. భిన్నధ్రువాలు కలుసుకోవు అనే నిజాన్ని వెక్కిరిస్తున్నాయి.
పూర్వం ఒక యువకుడికి ఈ సంసార బాధలను చూసి విరక్తి కలిగింది. అదే విషయాన్ని గురువుకు చెప్పి, తనకు కర్తవ్యాన్ని బోధించుమన్నాడు. అప్పుడా గురువు శిష్యుణ్ని నిర్జన వనంలోకి వెళ్లి తపస్సు చేయమన్నాడు. తాను కొంతకాలం పాటు కాశీనగరం మొదలైన తీర్థాలను సందర్శించివచ్చి, తపస్సును చూస్తానన్నాడు. శిష్యుడు సంతోషంతో 'సరే' అని ఊరిపొలిమేరలో ఉన్న ఒక వనాన్ని ఎంచుకొని తపస్సు ప్రారంభించాడు. అక్కడే ఒక కుటీరం నిర్మించుకుందామనుకొని, అడవిలోకి వెళ్లి, అక్కడ లభించిన కర్రలూ, ఆకులతో ఒక కుటీరాన్ని కట్టుకున్నాడు. నారలతో గోచిపాతలు అల్లుకున్నాడు. కేవలం గోచిపాతను మాత్రమే కట్టుకొని, ఒక చెట్టుకింద కూర్చొని, తపస్సు ప్రారంభించాడు. కందమూలాలు తింటూ, కొండవాగుల నీళ్లు తాగుతూ నియమంగా నిష్ఠను కొనసాగిస్తున్నాడు. ఇలా ఒకదినం గడిచింది. మరుసటి రోజు ఉషఃకాలంలోనే మేల్కొని యోగాసనాలువేసి, స్నానంచేసి, తడిసిన గోచిపాతను కుటీరంపై ఆరవేసి, మరొక గోచిపాతను ధరించి మళ్లీ తపస్సులో నిమగ్నమైపోయాడు. రెండోరోజూ నిర్విఘ్నంగా సాగిపోయింది. మూడోనాడు ప్రభాతవేళలో అతడు స్నానంచేసి, గతదినం కుటీరంపై ఆరవేసిన గోచిపాతను కట్టుకుందామనుకొని, దాన్ని చూశాడు. అప్పటికే ఆ గోచిపాతను ఎలుకలు బాగా తినివేశాయి. రంధ్రాలుపడిన గోచిపాతను కట్టుకోలేక మళ్లీ నారలతో గోచిపాతను అల్లుకొని కట్టుకొన్నాడు. ఈ కారణంగా అతనికి తపస్సు చేయవలసిన సమయం చాలా వృథా అయిపోయింది.
ప్రతిరోజూ అలా జరిగితే కష్టమని భావించిన ఆ యువకుడు ఎలుకల బాధను పోగొట్టుకోవడానికి గ్రామంలో నుంచి ఒక పిల్లిని తెచ్చి కుటీరంలో పెట్టుకున్నాడు. పిల్లిని చూసి ఎలుకలు పారిపోయాయి. ఇలా కొన్ని దినాలు బాగానే గడిచాయి. కానీ, పిల్లికి పాలవంటి పోషకాహారం లభించకపోవడంతో క్రమంగా అది బాగా చిక్కిపోయి, బలహీనమై- ఎలుకల్ని పట్టడం మానేసింది. ఇది గమనించిన ఆ యువకుడు ఇలా అయితే లాభం లేదనుకొని పిల్లికి కావలసిన పాలకోసం ఒక ఆవును కుటీరంలోకి తీసికొనివచ్చాడు. ఆవుపాల వల్ల పిల్లి ఆహార సమస్య తీరి- యువకుడి తపస్సు కొన్ని రోజులు నిరాటంకంగా కొనసాగింది. కానీ, పచ్చిగడ్డి తగినంత దొరక్కపోవడంతో ఆవు చిక్కిపోతూ, పాలు ఇవ్వడం మానేసింది. ఈ సమస్యను తీర్చడానికి గడ్డికోసం పొలాన్ని సాగుచేయాలనుకున్నాడు. ఊరిలోనుంచి కూలీలను రప్పించి, నేలను చదును చేసి, దున్ని, విత్తనాలను నాటించి, వరిపొలాన్ని సాగుచేయించాడు. పంట బాగా పండింది. ఆవుకు కావలసినంత గడ్డి దొరికింది. పుట్ల కొలదీ ధాన్యం పండింది. పనివాళ్లు తిన్నంత తినగా మిగిలిన ధాన్యాన్ని బండ్లకు ఎత్తించి ఊరిలోకి వెళ్లి విక్రయించాడు. డబ్బు చాలా వచ్చింది. ఆ డబ్బుతో మళ్లీ పొలాన్ని సాగు చేయించాడు. మళ్లీ పుష్కలంగా ధాన్యం పంట పండింది. ఇలా పలుమార్లు జరిగేసరికి ఆ యువకుడు సంపన్నుడయ్యాడు. సంపద పెరిగేసరికి అతిథులూ, బంధువుల తాకిడి పెరిగింది. అందరూ అతణ్ని పెళ్లిచేసుకొమ్మని ఒత్తిడి చేశారు. అతడు ఒక శుభముహూర్తంలో సుగుణవతి అయిన కన్యను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు పిల్లలు పుట్టారు. అలా సంసారం పెరిగిపోయింది. ఇంటి వ్యవహారాలు చూసుకోవడానికే సమయం చాలడంలేదు. తపస్సు మానేశాడు.
ఆ దశలో ఆ యువకుని గురువు తీర్థయాత్రలు చేసి, తిరిగి వచ్చి, శిష్యుని తపస్సు ఎలా సాగుతోందో చూద్దామని వచ్చాడు. అడవిలో పెద్దభవనం, మందీమార్బలం కనిపించాయి. ఆశ్చర్యంతో అక్కడివారిని అడిగి అసలు సంగతి తెలుసుకున్నాడు. తన శిష్యుడు తాపసి కాబోయి సంసారిగా మారిన వైనానికి నివ్వెరపోయాడు. గోచిపాతను రక్షించుకోవడానికి ఇంత పటాటోపం అవసరమా అని ప్రశ్నించుకున్నాడు. వైరాగ్యం మానసికంగా రావాలేగానీ, భౌతికంగా రాదనే సత్యాన్ని నెమరువేసుకొని, శిష్యుణ్ని కలవకుండానే వెనుదిరిగి వెళ్లిపోయాడు.
ఈ కథ సంసారులకే కాదు, సన్యాసులకూ కనువిప్పును కలిగించేదే. అవసరాలను పెంచుకుంటూ పోవడమే సాంసారిక బంధాల్లో బందీకావడం అనీ, అవసరాలను తగ్గించుకొని మానసిక వికాసానికి దారులు వేయడమే విముక్తం కావడం అనీ తెలుసుకుంట చాలు. అదే పదివేలు. బంధమోక్షాలు మనిషి చేతల్లోనే ఉన్నాయి.

Related Posts