మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని కలిసిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సంయుక్త ఎమ్ఎస్ఎమ్ఈ సీఈవో మరియు కేంద్ర పరిశ్రమల శాఖ అదనపు సలహాదారు డి.చంద్రశేఖర్
అమరావతి,
పరిశ్రమలు,వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో ఏపీ,తెలంగాణ సంయుక్త ఎమ్ఎస్ఎమ్ఈ సీఈవో, కేంద్ర పరిశ్రమల శాఖ అదనపు సలహాదారు డి.చంద్రశేఖర్ సమావేశమయ్యారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో గురువారం ఉదయం అల్పాహార సమయంలో మంత్రిని సలహాదారు కలుసుకున్నారు. కేంద్రం, రాష్ట్రంలో సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమల గురించి ప్రధానంగా చర్చ జరిగింది. రానున్న రోజుల్లో పరిశ్రమల ఏర్పాటులో ఎమ్ఎస్ఎమ్ఈలకు అధిక ప్రాధాన్యతనివ్వనున్న కేంద్రం విధివిధానాలను సీఈవో.. మంత్రి గౌతమ్ రెడ్డికి వివరించారు. రాష్ట్రం కూడా సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దిశగా ముందుకెళుతోందని మంత్రి వెల్లడించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రూపొందించిన 'వైఎస్ఆర్ నవోదయం' పథకం గురించి మంత్రి.. సీఈవోకు వివరించారు. జిల్లాల వారీగా రుణ ఇబ్బందుల్లో ఉన్న సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను గుర్తించేందుకు కలెక్టర్ల నేతృత్వంలో ప్రభుత్వం కమిటీలను నియమించినట్లు మంత్రి వెల్లడించారు.